5 September, 2026 | 10:52 PM

కేసీఆర్ రాజీనామా చేయాలి

05-09-2026 | 09:47pm

- ప్రజాస్వామ్యానికి బీఆర్ఎస్ చేటు 

- నేడు ఇందిరా పార్క్ ధర్నాకు తరలిరావాలి

- కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి 

ఎల్బీనగర్: మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) తన ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేయాలని, లేదా స్పీకర్ బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ లో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్(Madhuyashki Goud)తో కలిసి చల్లా నర్సింహారెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ నాణేనికి ఉన్న రెండు ముఖాలు అని, రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. పదేండ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకున్నారని, వీళ్లకు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు‌.

దళిత ముఖ్యమంత్రి, ఇంటికో ఉద్యోగం, మూడేకరాల భూ పంపిణీ, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రైతు రుణమాఫీ అనేక హామీలు ఇచ్చి మోసం చేసింది కేసీఆర్ అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చిందని, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు ప్రయాణం, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, సన్నబియ్యం పంపిణీ తదితర అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. తాము చేసిన అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా పనికి రాడని, వెంటనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ రాజీనామా(KCR resignation) చేయాలనే డిమాండ్ తో ఆదివారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా(Congress party dharna) నిర్వహిస్తుందని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ నుంచి 2 వేల నుంచి 2,500 మంది కార్యకర్తలు ధర్నాకు తరలిరావాలని మధుయాష్కీ గౌడ్ పిలుపునిచ్చారు.  సమావేశంలో టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, మాజీ కార్పొరేటర్లు సుజాతా నాయక్, ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, వజీర్ ప్రకాశ్ గౌడ్, నాయకులు రామ్మోహన్ గౌడ్, ఈశ్వరమ్మ యాదవ్, సురేష్ యాదవ్, దాము మహేందర్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు