స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు
తుర్కపల్లిలో బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో
బీఆర్‌ఎస్ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
డప్పుల మోత.. నినాదాలతో హోరెత్తిన మండల కేంద్రం
ఆలేరు, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తుర్కపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ రాస్తారోకో నిర్వహించాయి. స్పీకర్ పదవికి, శాసనసభ గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
రాస్తారోకోలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొని బీఆర్‌ఎస్ నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలు డప్పులు వాయిస్తూ, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేయడంతో తుర్కపల్లి మండల కేంద్రం హోరెత్తింది. భారీగా కార్యకర్తలు తరలిరావడంతో చిట్యాల–ఢిల్లీ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే కీసర–యాదగిరిగుట్ట హైవేపై కూడా వాహనాలు నిలిచిపోయాయి. రాస్తారోకో అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ ముట్టడికి బయలుదేరారు. దీంతో పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.