వాగులో చెత్త డంపింగ్ వెంటనే నిలిపివేయాలి
స్మశాన వాటిక ఏర్పాటు చేయాలి: కౌన్సిలర్ పాకాల మౌనిక హరీష్
ఆలేరు,(విజయక్రాంతి): ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో వాగులో డంపింగ్ చేస్తున్న చెత్తను వెంటనే తొలగించాలని, వార్డులో స్మశాన వాటిక (వైకుంఠధామం) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కౌన్సిలర్ పాకాల మౌనిక హరీష్(Councillor Pakala Mounika Harish) శనివారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డులో సరైన డంపింగ్ స్థలం లేకపోవడంతో నిత్యం సేకరించే చెత్తను వాగులో వేయాల్సి వస్తోందని, దీంతో పారిశుధ్య సమస్యలు తలెత్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
వాగులో పేరుకుపోయిన చెత్తను వెంటనే తరలించి, చెత్తను తరలించేందుకు శాశ్వతంగా తగిన స్థలాన్ని కేటాయించాలని కోరారు. అదేవిధంగా ఒకటో వార్డులో స్మశాన వాటిక(Crematorium) లేకపోవడంతో ఎవరైనా మృతి చెందినప్పుడు అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. చెత్త నిర్వహణ, స్మశాన వాటిక ఏర్పాటు రెండూ ప్రజల ప్రాథమిక అవసరాలకు సంబంధించిన అంశాలని, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని మౌనిక హరీష్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో యాట శివ, పాశికంటి సంపత్ తదితరులు పాల్గొన్నారు.