ఎక్కలి దేవ్ చెరువును పరిశీలించిన కౌన్సిలర్ గజవాడ నాగరాజు..
రామాయంపేట, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో సాగుతున్న వేళ.. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు(Councilor Gajawada Nagaraju) సూచించారు. రామాయంపేట మున్సిపల్ పరిధిలోని గోలిపర్తి గ్రామంలోని ఎక్కలి దేవ్ చెరువు(Ekkali Dev Cheruvu)ను ఆయన సందర్శించి, నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
చెరువు వద్ద నిమజ్జనానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వెలుతురు, పారిశుద్ధ్యం, తాగునీరు, భద్రత, నిమజ్జనానికి అనువైన ఏర్పాట్లు తదితర అన్ని సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. వినాయక నిమజ్జనం భక్తి భావంతో పాటు పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉత్సవాల సందర్భంగా చెరువు పరిసరాల్లో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.