ఎస్సీలకు కేటాయించిన స్థలం కబ్జా?

02-10-2026 | 11:20pm

- బీఆర్ఎస్ నాయకులపై అట్రాసిటీ నమోదు చేయాలి 

- నాగోల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన దళితులు 

ఎల్బీనగర్, అక్టోబర్ 2: ఎస్సీలకు ప్రభుత్వం కేటాయించిన కమర్షియల్ స్థలాన్ని కబ్జాకు చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నాగోల్ పోలీస్ స్టేషన్(Nagole Police Station)లో బీఆర్ఎస్ నాయకులపై దళితులు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ఎం.సూర్యప్రకాశ్(M. Suryaprakash) మాట్లాడుతూ.. నాగోల్ డివిజన్ జైపూర్ కాలనీలోని రోడ్డు నెంబర్ 1లో ఉన్న షెడ్యూల్ కులాలకు సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్  స్థలాన్ని కబ్జా చేయడానికి బీఆర్ఎస్ నాయకుడు అనంతుల రాజిరెడ్డి తన అనుచరులతో కలిసి ప్రయత్నిస్తు న్నారన్నారు. ఎస్సీ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన బోర్డుతో పాటు ఫెన్సింగ్ సైతం కూల్చి వేశారని తెలిపారు.‌ జైపూర్ కాలనీలో 1987లో అప్పటి ప్రభుత్వం ఎస్సీలు వ్యాపారం చేసుకోవడానికి స్థలం కేటాయించిందన్నారు.

కొందరు లబ్ధిదారులు ఇప్పటికీ వ్యాపారం చేస్తున్నారని, కొంతమంది స్థానిక రాజకీయ నాయకులు స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై గతేడాది ఎస్సీ కార్పొరేషన్  అధికారులకు ఫిర్యాదు చేయగా, ప్రభుత్వ స్థలంలో బోర్డు పాతి, ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అయితే, శిథిలావస్థలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ పునర్నిర్మాణ పనులను కోసం శుక్రవారం ఎస్సీ కార్పొరేషన్ అధికారులు పోలీస్ బందోబస్తుతో వచ్చారని తెలిపారు.

కాగా, బీఆర్ఎస్ నాయకుడు అనంతుల రాజిరెడ్డి, పైడిమర్రి శంకర్, మాధవి, యాదగిరి, సద్గుణ, నందికంటి అజయ్, జంకాల కుమార్, నందికంటి లక్ష్మి తదితరులు బోర్డును, ఫెన్సింగ్ తొలిగించారని చెప్పారు. ఎస్సీ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. ఈ మేరకు ఫిర్యాదు పత్రం అందజేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు ఎల్లయ్య, వేణు, రాజ్ కుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు