మెట్రో స్టేషన్లు బంద్

02-10-2026 | 09:52am

ఢిల్లీలో హై అలర్ట్.. 11 మెట్రో స్టేషన్లు మూసివేత! అసలేం జరుగుతోంది?

న్యూఢిల్లీ: జంతర్ మంతర్‌ చుట్టూ ఒక్కసారిగా భద్రతా వలయం.. మెట్రో స్టేషన్ల వద్ద ఆంక్షలు.. భారీగా పోలీసుల మోహరింపు! CEC గ్యానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా CJP( Cockroach Janta Party) నిరసనకు పిలుపునివ్వడంతో ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు నిరసనకు అనుమతి నిరాకరించడంతో పాటు కీలక ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. జంతర్ మంతర్ వద్ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) గ్యానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రతిపాదిత నిరసన నేపథ్యంలో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ఢిల్లీ పోలీసులు ఈ నిరసనకు అనుమతి ఇవ్వలేదని తాజా నివేదికలు వెల్లడించాయి.

11 మెట్రో స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ బంద్

భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (Delhi Metro Rail Corporation) కీలక నిర్ణయం తీసుకుంది. 11 మెట్రో స్టేషన్లలో ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాలను తదుపరి ఆదేశాల వరకు మూసివేసింది. అయితే కొన్ని ప్రధాన స్టేషన్లలో ఇంటర్‌చేంజ్ సదుపాయం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మూసివేసిన స్టేషన్లలో జన్‌పథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, రాజీవ్ చౌక్, సేవా తీర్థ్, మండీ హౌస్, లోక్ కల్యాణ్ మార్గ్, INA, చావ్డీ బజార్, రామకృష్ణ ఆశ్రమ మార్గ్, న్యూఢిల్లీ ఉన్నాయి. నిరసనల నేపథ్యంలో జంతర్ మంతర్, పార్లమెంట్ స్ట్రీట్, కనాట్ ప్లేస్, పటేల్ చౌక్, టాల్‌స్టాయ్ మార్గ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేస్తున్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

నిరసనకు అనుమతి నిరాకరణ

CEC గ్యానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో జంతర్ మంతర్(Jantar Mantar) వద్ద నిరసనకు పిలుపునిచ్చారు. ఎన్నికల జాబితాలు, Special Intensive Revision (SIR) ప్రక్రియకు సంబంధించిన అంశాలను నిర్వాహకులు లేవనెత్తుతున్నారు. ఢిల్లీ పోలీసులు మాత్రం ప్రతిపాదిత నిరసనకు అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు. దీంతో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. మెట్రో స్టేషన్ల మూసివేత, ట్రాఫిక్ మళ్లింపులతో సెంట్రల్ ఢిల్లీలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.


మరిన్ని వార్తలు