కామన్ పాస్‌తో సులభ ప్రయాణం
- శ్రమ తగ్గి.. సమయం, ఖర్చు ఆదా
- ప్రయాణికులకు మెరుగైన రవాణే ధ్యేయం
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- పొన్నం, వివేక్, అజారుద్దీన్‌తో కలిసి మెట్రో, బస్సు ప్రయాణం
- కామన్ పాస్‌పై ప్రయాణికుల స్పందన తెలుసుకున్న భట్టి
హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): ప్రజా రవాణా వ్యవస్థను మరింత సౌకర్యవంతం గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. మెట్రో, ఆర్టీసీ సేవలను అనుసంధానం చేస్తూ తీసుకువచ్చిన కామ న్ పాస్‌తో ప్రయాణం మరింత సులభతరంగా మారిందని, ప్రయాణికులకు ఒకే పాస్‌పై రెండు రకాల ప్రజా రవాణా సేవలను వినియోగించుకు నే అవకాశం కల్పించినట్లు తెలిపారు.
కామన్ పాస్ అమలు తీరును స్వయంగా పరిశీలించేందుకు భట్టితో సహా మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్, నవీన్‌యాదవ్, అధికారులు శనివారం బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు మెట్రోలో, అక్కడి నుంచి సచివాలయం వరకు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో భట్టి నేరుగా మాట్లాడారు.
కామన్ పాస్ వినియోగం ఎలా ఉంది? మెట్రో నుంచి బస్సుకు మారే సమయంలో ఏమైనా ఇబ్బందులున్నాయా? ప్రయాణం సులభంగా ఉందా? అంటూ ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. కామన్ పాస్ ఉపయోగకరంగా ఉందని, మెట్రో దిగిన తర్వాత గమ్యస్థానానికి చేరుకునేందుకు బస్సు సేవలను సులభంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడిందని పలువురు ప్రయాణికులు భట్టికి తెలిపారు.
భవిష్యత్తులో ఆటోలు, క్యాబ్‌ల అనుసంధానం: భట్టి
ప్రజా రవాణా వ్యవస్థలను అనుసంధానం చేయడం ద్వారా అంతరాయం లేకుండా, ఎలాం టి ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రయాణింవచ్చని ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. ఒకే పాస్‌తో మెట్రో, బస్సు సేవలను వినియోగించుకోవడం వల్ల ప్రయాణికు లకు టికెట్ల విషయంలో ఇబ్బందులు తప్పుతాయన్నారు. భవిష్యత్తులో ఆటోలు, క్యాబ్‌లను కూడా అనుసంధానం చేసి రవాణా వ్యవస్థలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.
ప్రయాణికుల సౌక ర్యార్థం కామన్ పాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు భట్టి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఒకే పాస్‌తో ఆర్టీసీ, మెట్రో సేవలను వినియోగించుకునే అవకాశం ఉండటంతో ప్రయాణికులకు సమయం, శ్రమ తగ్గడంతోపాటు ఖర్చు ఆదా అవుతుందన్నారు. ప్రజలను వ్యక్తిగత వాహనాల నుంచి ప్రజా రవాణా వైపు ఆకర్షించాలంటే ఆర్టీసీ, మెట్రో వ్యవస్థలు సమన్వయం పని చేయాలని కోరారు.
ప్రయాణికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని కామన్ పాస్ సేవలను మరింత మెరుగుపరుస్తామని పొన్నం తెలిపారు. రోజువారీ, నెలవారీ పాస్‌లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ప్రభుత్వ సలహాదారు (అర్బన్ ట్రాన్స్ పోర్ట్ ఎన్.వి.ఎస్.రెడ్డి, మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, మెట్రో అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బీ అజిత్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆగిన మెట్రో ఎస్కలేటర్
సికింద్రాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): బేగంపేట మెట్రోస్టేషన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అధికారులు ప్లాట్‌ఫాంకు చేరుకునేందుకు ఎస్కలేటర్ ఎక్కారు. సాంకేతిక లోపంతో ఎస్కలేటర్ మధ్యలోనే ఆగిపోయింది.
దీంతో వారు మెట్ల మార్గంలో ప్లాట్‌ఫాంకు చేరుకొని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు కామన్ పాస్‌పై తమ ప్రయాణం కొనసాగించారు. మెట్రోస్టేషన్లలో ఎస్కలేటర్లు సాంకేతిక సమస్యలతో తరచూ నిలిచిపోతుండటంతో ప్రయాణికులను అసౌకర్యానికి గురవుతున్నారు.