క్రీడలతో క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం
* క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలి: కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి
గరిడేపల్లి, సెప్టెంబర్ 18, (విజయక్రాంతి): క్రీడలు విద్యార్థులలో క్రమశిక్షణ మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి(MLA Uttam Padmavathi) అన్నారు. గరిడేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(School Games Federation) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గ స్థాయి అండర్-14, అండర్-17 బాలబాలికల కబడ్డీ పోటీలను కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసేందుకు ఇటువంటి పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం అప్పన్నపేట గ్రామానికి చెందిన కోదాడ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పెండెం వెంకటేశ్వర్లు తండ్రి పెండెం బిక్షం ఇటీవల అనారోగ్యంతో మృతి చందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు.