వెయిటేజీ ఎత్తేయాలి!
డీఎల్ పోస్టుల భర్తీ విధానంపై అభ్యర్థుల తీవ్ర అభ్యంతరం
- గత ఫిబ్రవరిలో జీవో నెం.4 విడుదల చేసిన ప్రభుత్వం
- అకడమిక్ స్కోర్‌కు 50, ఇంటర్వ్యూకు 10 శాతం మార్కుల వెయిటేజీ
- రాత పరీక్షకు 40 మార్కులు
- తాజాగా పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ సన్నాహాలు
- వెయిటేజీ విధానాన్ని వ్యతిరేకిస్తున్న అభ్యర్థులు
- జీవో4ను రద్దు చేయాలని, రాత పరీక్షనే ప్రామాణికంగా తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ (డీఎల్)(Assistant Professor in Government Degree Colleges) పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.4పై వివాదం ముసురుకుంటున్నది. ఈ జీవోతో చాలా మందికి అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెయిటేజీ విధానం తీసుకురావడం సబబుకాదని, దీన్ని ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నారు. 50 శాతం మార్కులు అకడమిక్లోని స్కోర్‌కు, 40 శాతం మార్కులు రాత పరీక్షకు, 10 శాతం ఇంటర్యూకు కేటాయించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కేవలం రాత పరీక్ష ద్వారానే ప్రతిభను గుర్తించాలంటున్నారు.
జీవోను గత ఫిబ్రవరిలో ప్రభుత్వం విడుదల చేయగా అప్పట్లోనే వివాదాలు మొదలయ్యాయి. ఇప్పుడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ టీజీపీఎస్సీ సన్నాహాలు చేస్తుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆ జీవో ఆధారంగా పోస్టులు భర్తీ చేస్తే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన అభ్యర్థులు, మరీ ముఖ్యంగా పదేండ్ల కింద అర్హత కోర్సులు పూర్తి చేసినవారు అంటున్నారు. అకడమిక్ స్కోర్‌లోని మార్కులకు వెయిటేజీని సహించబోమని చెప్తున్నారు.
ఒక్కో వర్సిటీలో ఒక్కో రకం మార్కులు!
అకడమిక్ మార్కులకు వెయిటేజీతోనే ప్రధాన సమస్య అని అభ్యర్థులు అంటున్నారు. జీవో ప్రకారం అకడమిక్ ప్రతిభకు 50శాతం వెయిటేజీ ఇచ్చారు. ఇందులో గ్రాడ్యుయేషన్ (యూజీ)లో 80 శాతం దాటితే వెయిటేజీ 21 మార్కులు.. 60 శాతం వస్తే వెయిటేజీ 19 మార్కులు.. 55 శాతం వస్తే వెయిటేజీ 16 మార్కులు ఇస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ)లో 80 శాతం దాటితో 25 మార్కులు.. 60 శాతం ఉంటే 23 మార్కులు.. 55 శాతం ఉంటే 20 మార్కుల వెయిటేజీ ఇస్తారు.
ఎంఫిల్‌లో 60 శాతానికిపైగా ఉంటే ఏడు మార్కులు, పీహెచ్‌డీకి 25 మార్కుల వెయిటేజీ ఇస్తారు. నెట్ జేఆర్ఎఫ్ ఉంటే 10 మార్కులు, నెట్‌కు 8 మార్కులు, సెట్‌కు 5 మార్కులు వెయిటేజీగా ఇస్తారు. అవార్డ్స్ (జర్నల్స్ పబ్లిష్)కు 3 మార్కులు వెయిటేజీగా ఇవ్వనున్నారు. ఈ విధానంతో రాత పరీక్షకు ముందే అభ్యర్థుల మధ్య గణనీయమైన మార్కుల వ్యత్యాసం ఏర్పడే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.
పది, పదిహేనేండ్ల కింద యూజీ, పీజీల్లో మంచి మార్కులు రావాలంటే చాలా కష్టం. 50 శాతం మార్కులు రావాలంటేనే ఎంతో కష్టపడాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు విద్యార్థులకు 90 శాతం వరకు కూడా వస్తున్నాయి. పైగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివిన అభ్యర్థుల మధ్య మార్కుల వ్యత్యాసం ఎక్కువగానే ఉంటుంది. ఒక్కో యూనివర్సిటీ ఒక్కోలా మార్కులను వేస్తున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలు మార్కులను ఒకలా వేస్తే ప్రైవేట్ యూనివర్సిటీలు, అటానమస్ కాలేజీలు మరోలా వేస్తున్నాయి. కాకతీయ యూనివర్సిటీ 50 శాతం వరకు మార్కులు వేస్తే, ఉస్మానియా వర్సిటీ 70 శాతం వరకు మార్కులను వేస్తున్నాయని అభ్యర్థులు పేర్కొంటున్నారు.
ఇక.. పలు ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలైతే 95 శాతం వరకు కూడా వేస్తున్నాయి. ఈ అంతరాన్ని ఎలా చూస్తారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇంటర్వ్యూలో కూడా అన్యాయం జరిగేందుకు అస్కారం ఉందంటున్నారు. అవకతవకలు, పైరవీలకు తెరలేపే అవకాశం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత పరీక్షలో ఎన్ని మార్కులు సాధించినప్పటికీ ఇంటర్వ్యూల పేరిట కావాల్సిన వారికి పోస్టులు కట్టబెట్టే వీలుంటుందని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పెద్ద దృష్టికి సమస్య
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ సన్నాహాలు చేస్తున్నది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలకానున్నది. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో జీవో నెం. 4ను జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.4తో నిరుద్యోగులకు నష్టం వాటిల్లుతుందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఇప్పటికే వేం నరేందర్ రెడ్డితోపాటు పలువురు ప్రభుత్వ పెద్దలను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
ఈ జీవోను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. యూజీసీ నిబంధనలకు తగ్గట్టు నెట్, సెట్, పీహెచ్డీ అర్హత కలిగిన అభ్యర్థులకు సమానమైన పోటీ అవకాశం కల్పించాలని, రాత పరీక్ష ద్వారా తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కల్పించాలని వారు అంటున్నారు.
అభ్యర్థుల ప్రధాన డిమాండ్లు...
* జీవో నెం.4ను రద్దు చేయాలి లేదా పునఃపరిశీలించాలి.
* నెట్, సెట్, పీహెచ్డీ అర్హత కలిగిన అభ్యర్థులందరికీ సమాన పోటీ అవకాశం కల్పించాలి. గతంలో యూజీ, పీజీ మార్కులను పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు.
- * అభ్యర్థుల ప్రతిభను అంచనా వేయడానికి రాత పరీక్షకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
* పీహెచ్‌డీకి కేటాయించిన అధిక వెయిటేజీని పునఃపరిశీలించాలి.
* ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న నియామక విధానాలను కూడా పరిశీలించాలి.
* పారదర్శకమైన, ప్రతిభ ఆధారిత సమాన అవకాశాలతో కూడిన నియామక విధానాన్ని అమలు చేయాలి.