కాంగ్రెస్ పాలనలో సమాఖ్య ఆంధ్రా నేతల పెత్తనం

27-09-2026 | 12:00pm

కొండా లక్ష్మణ్ బాపూజీకి మాజీ మంత్రి జోగు రామన్న నివాళ్ళు

ఆదిలాబాద్,సెప్టెంబర్ 27,(విజయక్రాంతి): స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారుడు కొండ లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పుట్టడం మనందరి గర్వకారణమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా  ఆదివారం పట్టణంలోని కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ...తెలంగాణ సమాజం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవిని సైతం  త్యాగం చేసి,ఉద్యమంలో ముందుండి పోరాడారని గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో  తెలంగాణ ఉద్యమ పార్టీకి జలవిహార్ వద్ద స్థలంతో పాటు భవనాన్ని ఇచ్చిన  వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు.3ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మళ్లీ సమైక్యాంధ్ర నేతల పెత్తనం పెరిగిపోయిందని.. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వంలో వారి ఆగడాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. పద్మశాలి సంఘం సభ్యులు జక్కుల సత్యనారాయణ, కుర్ర రవీందర్, ఉషన్న, అడెల్లు, రమేష్, నర్సింగ్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాసరి రమేష్, గండ్రత్ రమేష్, మెట్టు ప్రహ్లాద్, చందాల రాజన్న తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు