కాంగ్రెస్ చేతకానితనంతోనే కరువు
- కళ్లెదుట నీళ్లున్నా.. మోటర్లు ఆన్ చేయరా
- కాళేశ్వరంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గోబెల్స్ ప్రచారం
- కృష్ణా జలాల్లో వాటాను కూడా వినియోగించుకోలేని పరిస్థితి
- కొడంగల్-నారాయణపేట అంచనా రూ.6,825 కోట్లకు ఎలా పెరిగింది
- మాజీమంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని కరువు పరిస్థితులకు ప్రకృతి వైపరీత్యం, ఎల్ నినో(El Nino)ను కారణంగా చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు(Tanneeru Harish Rao) ఆరోపించారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) చేతకానితనంతో వచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో నీళ్లు, కరెంటు అందుబాటులో ఉన్నా రైతులకు చేరవేయడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు.
శుక్రవారం తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకున్నదని, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కేసీఆర్ సర్కారు రైతులకు 24 గంటల విద్యుత్ అందించిందని, రెండు పంటలకు రైతుబంధు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ అందుబాటులో ఉన్నా వ్యవసాయానికి కోతలు విధించే పరిస్థితి తీసుకొచ్చిందని విమర్శించారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది తెలంగాణ 84 టీఎంసీల నీటిని వినియోగించుకుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పడం పచ్చి అబద్ధమని అన్నారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే రాజకీయ కక్షతో పాలమూరు మోటార్లను మూడేళ్లుగా నిలిపివేశారని ఆరోపించారు. కృష్ణా బేసిన్లో అత్యంత తక్కువ నీటి వినియోగం నమోదైన కాలం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయామేనని ఎద్దేవా చేశారు. తెలంగాణకు గల 36 శాతం వాటా నీటిని పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
ప్రస్తుత కరువు పరిస్థితుల్లో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ సుమారు 83 టీఎంసీల నీటిని వినియోగించుకోగా, హైదరాబాద్ తాగునీటి వినియోగాన్ని కలుపుకుని తెలంగాణ 43 టీఎంసీలే వినియోగించుకుందని.. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద శ్రీశైలంలో నీరు అందుబాటులో ఉన్నా ఐదు మోటర్లకు ఒకటి, రెండే నడుపుతున్నారని, దీంతో కేసీఆర్ ప్రభుత్వం సృష్టించిన 3.16 లక్షల ఎకరాల ఆయకట్టు ఇబ్బందుల్లో పడిందని ఆరోపించారు.
నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, జూరాల కింద దాదాపు ౩ లక్షల ఎకరాల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఆల్మట్టి నుంచి నెల రోజుల పాటైనా నీటిని విడుదల చేయించే ప్రయత్నం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కాంక్రీట్ నాణ్యత ఎక్సలెంట్ ఉందని, మేడిగడ్డలో కుంగిన బ్లాక్ మినహా మిగిలిన ఆరు బ్లాకులు సురక్షితంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ నివేదిక తేల్చిందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నీటిని ఎత్తుకునే అవకాశం ఉందని ఎన్డీఎస్ఏ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని, రిటైర్డ్ ఇంజనీర్లు కూడా మేడిగడ్డ గేట్లు తెరిచి ఉంచి ప్రవాహం ద్వారా నీటిని ఎత్తుకోవచ్చని సూచిస్తూ లేఖలు రాసినప్పటికీ కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను నడపడం లేదని మండిపడ్డారు. మేడిగడ్డ వద్ద 46,990 క్యూసెక్కుల ప్రవాహం ఉందని, రోజుకు నాలుగు టీఎంసీలకు పైగా నీరు కిందకు వృథాగా వెళ్లిపోతోందని చెప్పారు. రైతుల ప్రయోజనాల కోసం అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకోవాలని సూచించారు.
‘కొడంగల్’ ప్రాజెక్ట్ అంచనాలు ఐదు రెట్లు
ఎల్లంపల్లికి ఈసారి 37 టీఎంసీల వరద నీరు వచ్చినప్పటికీ కేవలం ఆరు టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తుకున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్యాకేజీ -8 వద్ద రౌండ్ ది క్లాక్ విద్యుత్ అందించి మోటార్లు నడిపి ఉంటే మరింత నీటిని ఒడిసిపట్టుకునే అవకాశం ఉండేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను పవర్ సర్ప్లస్ రాష్ట్రంగా మార్చి అప్పగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దానిని సర్వనాశనం చేసిందన్నారు. రోజుకు రూ.1500 ఖర్చు పెట్టి రైతులు డీజిల్ జనరేటర్లు పెట్టి పంటలను కాపాడుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.
మొత్తంగా 3,300 మెగావాట్ల విద్యుత్‌ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులో లేకుండా పోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం పెరిగిందంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రచా రం చేస్తున్నారని, మరి సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోని కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం అంచనాల పెంపుపై సమాధానం చెప్పాలని సవాల్ చేశారు.
పనులు ప్రారంభం కాకముందే అంచనాలు దాదాపు ఐదు రెట్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాజకీయ విమర్శలు, ఆరోపణలు పక్కనపెట్టి పరిపాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. కన్నెపల్లి మోటార్లను వెంటనే ఆన్ చేసి గోదావరి నీటిని ఎత్తిపోసుకోవాలని, దేవాదుల, కల్వకుర్తి, పాలమూరు--రంగారెడ్డి తదితర ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.