ఎవుసంపై ఎల్ నినో ఎండలు

04-10-2026 | 05:25am
  1. వాడిపోతున్న పత్తి, మిరప పంటలు
  2. అరిగోస పడుతున్న గద్వాల జిల్లా రైతులు
  3. పెరిగిన పెట్టుబడులు 
  4. దిగుబడిపై నమ్మకం కరువు
  5. పూత, కాయ దశలో భూమిలో తేమ గాయబ్
  6. వాడిపోతున్న పంటలు చూస్తూ రైతుల కన్నీళ్లు

గద్వాల, అక్టోబర్ 3 (విజయక్రాంతి): భూమినే నమ్ముకున్న రైతన్నను ఎల్ నినో(El Niño and the Farmer) అరిగోసపెడుతున్నది. పేరుకే వానాకాలం.. ఒక్క పెద్దవాన కూడా లేదు. ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. దీంతో మట్టిలో తేమ లేక.. పంటలు మాడిపోతున్నాయి. ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లా రైతులు ఆగమవుతున్నారు.

వర్షాభావ పరిస్థితులను గమనించి ఇక్కడ పెద్దగా వరిసాగు చేపట్టలేదు. పత్తి, మిరప, కంది, మక్క తదితర పంటల సాగు చేపట్టారు. ప్రస్తుతం పూత, కాయ దశలో పంటలు ఉండగా.. ఎండ సెగలు ఆందోళన కలిగిస్తున్నాయి. కండ్ల ముందే పంటలు వాడిపోతుండటంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 

పెరిగిన పెట్టుబడులు

జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులు 1,72,572 ఎకరాల్లో పత్తి, 30,387 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేపట్టారు. మరో 27,179 ఎకరాల్లో కందులు వేశారు. ఈసారి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు భారీగా పెరిగాయి. దీనికి తోడు పంటలను కాపాడుకునేందుకు అదనంగా నీటి కోసం కూడా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. విత్తనాలు విత్తుకున్నప్పుడు, ఆ తర్వాత కూడా పలు ప్రాంతాల్లో రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పోశారు.

తీరా పూత, కాయ దశలో భూమిలో తేమ కరువవడం.. వారిని కలవరపెడుతున్నది. ఇప్పటికే పెట్టుబడి ఖర్చులు తడిసిమోపెడయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే అవకాశం లేదని బాధపడుతున్నారు. 

కౌలు రైతులకు రెట్టింపు భారం 

ఇప్పటికే సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కౌలు రైతుల పరిస్థితి మరింత దారు ణంగా తయారైంది. కౌలు చెల్లించడంతోపాటు పంట పెట్టుబడులు భరించాల్సి రావ డంతో వారిపై ఆర్థిక భారం పెరిగింది. వర్షాభావంతో పంట నష్టపోతే కౌలు, పెట్టుబడి రెండూ నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని కౌలు రైతులు వాపోతున్నారు.

పంట నష్టాన్ని అంచనా వేయాలి 

వర్షాభావ పరిస్థితుల కారణంగా దెబ్బతిన్న పంటలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు అవసరమైన నీటి వసతి కల్పించడంతో పాటు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తగిన సాయం అం దించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఖరీఫ్ చివరి దశలోనైనా వర్షాలు కురిసి పంటలకు ఊరట లభించాలని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈసారి ఎకరాకు రూ. 25 వేల వరకు కౌలు చెల్లించి పత్తి, మిరప సాగు చేశాను. వర్షాలు సకాలంలో కురవక పంటలకు కీలక దశలో నీరు అందలేదు. దీంతో పూత, కాయల దశలో కండ్ల ముందు పత్తి మొక్కలు వాడిపోతున్నాయి. వాటిని చూస్తుంటే కన్నీళ్లు ఆగ డం లేదు. విత్తనాలు, ఎరువులు, మందు లు, కూలీలకు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.  

 వెంకట్ రాములు, కౌలు రైతు, ఎల్కూర్ గ్రామం, మల్దకల్ మండలం, జోగులాంబ గద్వాల జిల్లా 

ప్రభుత్వం ఆదుకోవాలి

సకాలంలో వర్షాలు లేక పత్తి పంట పూత, కాయ దశలోనే ఎండిపోయింది. 16 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిరప సాగు చేసిన. నాకు ఎకరాకు రూ.15 వేల కౌలు చెల్లించడంతోపాటు విత్తనాలు, ఎరువులు, మందులు, కూలీల కోసం భారీగా ఖర్చయింది.

నేలలో తేమ లేక పంటను కాపాడుకునేందుకు అదనంగా ఖర్చు చేసినా ఫలితం కనిపించడం లేదు. కౌలు, పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. వర్షాభావంతో నష్టపోయిన కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించి పంట నష్టపరిహారం, ఆర్థిక సాయం అందించాలి.

 అరుణ్, కౌలు రైతు, చెన్నిపాడు గ్రామం, జోగులాంబ గద్వాల జిల్లా 

కన్నీళ్లు ఆగడం లేదు

మరిన్ని వార్తలు