తహసీల్దార్ సంగ్రామ్రెడ్డిని నిలదీసిన మాజీ ఎమ్మెల్యే
కల్యాణలక్ష్మి, ఫామ్‌ల్యాండ్ రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై భూపాల్‌రెడ్డి ఆగ్రహం
నాగల్గిద్ద, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): అర్హులైన నిరుపేదలకు అందాల్సిన కల్యాణలక్ష్మి దరఖాస్తులను నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడం ఏమిటని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి(Former MLA Mahareddy Bhupal Reddy) నాగల్గిద్ద తహసీల్దార్ సంగ్రామ్రెడ్డిని ప్రశ్నించారు. నాగల్గిద్ద గ్రామానికి చెందిన నౌసీన్ బేగం కల్యాణలక్ష్మి దరఖాస్తు మార్చి నుంచి సుమారు ఆరు నెలలుగా కార్యాలయంలో పెండింగ్‌లో ఉందని పేర్కొంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
అన్ని విధాలా అర్హత ఉన్నప్పటికీ దరఖాస్తును ఎందుకు పరిష్కరించడం లేదని, పేద కుటుంబాలను కార్యాలయాల చుట్టూ తిప్పడం సరికాదన్నారు. ప్రభుత్వం తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, ప్రస్తుతం కల్యాణలక్ష్మి పథకం అమలులోనే జాప్యం చేస్తోందని ఆయన విమర్శించారు. అర్హుల దరఖాస్తులను వెంటనే పరిశీలించి ప్రయోజనం అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మండలంలో ఫామ్‌ల్యాండ్ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపైనా భూపాల్‌రెడ్డి తహసీల్దార్‌ను ప్రశ్నించారు. కొన్ని రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ మరికొన్ని కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని పేర్కొంటూ, అందరికీ ఒకే నిబంధనలు వర్తిస్తున్నాయా అని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ చేయడానికి లేదా నిలిపివేయడానికి ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు ఏమిటో ప్రజలకు స్పష్టం చేయాలని కోరారు.
ప్రజాప్రతినిధుల సూచనలు లేదా ఇతరుల ఒత్తిళ్లతో రిజిస్ట్రేషన్లపై నిర్ణయాలు మారుతున్నాయా అని ప్రశ్నించిన ఆయన, ఎవరి ఆదేశాలతో రిజిస్ట్రేషన్లు ఆగుతున్నాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ల విషయంలో ముడుపులు అందిన వారి పనులు జరుగుతూ, ముడుపులు ఇవ్వని వారి రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ, వాటిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు.
పేదలకు సంబంధించిన సంక్షేమ పథకాల అమలులో అనవసర జాప్యం చేయడం, భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో పారదర్శకత పాటించకపోవడం సరికాదని భూపాల్‌రెడ్డి అన్నారు. కల్యాణలక్ష్మికి అర్హులైన ప్రతి దరఖాస్తుదారుడి ఫైల్‌ను వెంటనే పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించాలని, ఫామ్‌ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు అందరికీ ఒకే విధమైన నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం, అధికారులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే బాధితులను సమీకరించి నాగల్గిద్ద తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. పేదలకు న్యాయం జరిగే వరకు వారి తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని భూపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.