ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
- నమోదు లేకుంటే ప్రభుత్వ పథకాలకు అర్హత ఉండదు
- ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
- సింగరేణిలో ఎరువుల దుకాణాల్లో ఏడీఏ కరుణశ్రీ ఆకస్మిక తనిఖీలు
సింగరేణి సెప్టెంబర్ 30 విజయ క్రాంతి: రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్(Farmers Farmer Registration) నమోదు చేసు కోవాలని, లేనియెడల ప్రభుత్వం ప్రవేశపెట్టే వివిధ వ్యవసాయ పథకాలకు అర్హులు కారని వ్యవసాయ శాఖ వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ తెలిపారు.ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో బుధవారం ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా దుకాణాల్లో ఎరువుల నిల్వలు,స్టాక్ రిజిస్టర్లు,విక్రయ వివరాలను పరిశీలించారు.
ఎరువుల గోదాములను తనిఖీ చేసి రికార్డుల్లో చూపుతున్న నిల్వలకు,గోదాముల్లో ఉన్న నిల్వలకు సరిపోలుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించారు.అలాగే పురుగుమందుల గడువు తేదీలు,వాటి నిల్వ,విక్రయాలకు సంబంధించిన వివరాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఏడీఏ కరుణశ్రీ మాట్లాడుతూ రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎంతో కీలకమని పేర్కొన్నారు.ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రవేశపెట్టే వివిధ పథకాలు,ప్రయోజనాలను పొందేందుకు అర్హత విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు.అందువల్ల రైతులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు.మండలంలో రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని తెలిపారు.రైతులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని నిబంధనల ప్రకారం యూరియాను పొందాలని సూచించారు.
ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,అవసరాలకు అనుగుణంగా సరఫరా జరిగేలా వ్యవసాయ శాఖ పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు.ఎరువుల వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులను విక్రయించాలని స్పష్టం చేశారు.నిర్ణీత ధర కంటే ఒక్క రూపాయి అధికంగా వసూలు చేసినా రైతులు వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులపై విచారణ జరిపి,నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత దుకాణదారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎరువులు,పురుగుమందుల విక్రయాల్లో దుకాణదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని,స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు.రైతులకు నాణ్యమైన ఎరువులు,పురుగుమందులు అందేలా తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.ఈ తనిఖీల్లో సింగరేణి మండల వ్యవసాయ అధికారి బట్టు అశోక్‌కుమార్,ఏఈఓ నరేష్ తదితరులు పాల్గొన్నారు.