వెండితెరను ఉయ్యాలలూపుతున్న జానపదం
మొన్న ‘మల్లెపూల పల్లకి’.. నిన్న ‘ఏష నాగుల కట్ట’.. రేపు ‘రఘుకుల తిలక రారా’... ఇలా ఇప్పటికే జనం నాలుకలపై నాట్యమాడుతున్న జానపదం వెండితెర వీధుల్లో బంగారు పల్లకీలో ఊరేగుతోంది. తెలుగునాట ప్రాచుర్యం పొందిన ప్రైవేటు జానపద గీతాలకు, యూట్యూబ్ ఆల్బమ్స్(YouTube Albums)కు టాలీవుడ్ మరింత వన్నె తీసుకొస్తోంది. తెలుగు సినిమాల్లో ఫోక్స్ సాంగ్స్(Folk Songs)ను రీమేక్ చేసి, పెద్ద హిట్ సాధించిన ట్రెండ్ ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. మొత్తంగా జానపదం సినీరంగాన్ని ఉయ్యాలలూపుతున్నది.
నాని(Nani) ‘ది పారడైజ్’(‘The Paradise’) కోసం జంగిరెడ్డి, ప్రభ(Jangireddy, Prabha) పాడిన ‘ఏష నాగుల కట్ట(Nagula Katta)..’ పాట సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచింది. దీనికన్నా ముందు ‘ఇరుముడి’ చిత్రంలో ‘మల్లెపూల పల్లకి..’ భక్తి జానపదం జనం నాలుకలపై తాండవిస్తోంది. గతంలో ‘మహాత్మ’ సినిమా లోని ‘నీలపురి గాజుల ఓ నీలవేణి’ వంటి పాటలు సినిమాల్లో అలరించినప్పటికీ ఇటీవల తెలంగాణ బాణీలు ఆదరణ పొందుతున్నాయి. ఆంధ్రా ప్రాంతంలోని కొన్ని పాటలు కూడా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ప్రైవేటు జానపదాలు సినిమాల్లో వినిపించడం కొత్తేమీ కానప్పటికీ ఇటీవల వీటి వినియోగం చిత్రపరిశ్రలో ఎక్కువయింది. గతంలో ‘సారంగ ధరియా..’ అనే ప్రైవేటు జానద గీతాన్ని ‘లవ్‌స్టోరీ’ సినిమాలో పెట్టారు. తెలంగాణకు చెందిన ఈ పాత జానపదాన్ని సుద్దాల అశోక్‌తేజ(Suddala Ashok Teja) తనదైన శైలిలో మెరుగులు అద్దారు. ఈ పాటను పవన్ సీహెచ్ సంగీతంలో మంగ్లీ పాడగా, సాయిపల్లవి డాన్స్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించింది. ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా బాగా ఫేమస్ అయిన ‘గున్న గున్న మామి డి..’ జానపద గీతాన్ని రవితేజ సినిమా ‘రాజా ది గ్రేట్’లో బిట్ సాంగ్‌గా వాడారు.
రవితేజ నటించిన మరో సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో ‘వామ్మో వాయ్యో వల్లెంకలో..’ పాటను స్వాతిరెడ్డి పాడారు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాలో మిట్టపల్లి సురేందర్ రాసిన ‘రాంబాయి’ పాట కూడా ‘మంజుల నీ మీద నాకు మనసాయెనే..’ అనే పాట స్ఫూర్తితో సరికొత్తగా రూపుదాల్చిందే! ‘దిగు దిగు దిగు నాగా..’ పాత ప్రైవేట్ భక్తి జానపద గీతాన్ని ‘రెడీ’ సినిమా డైరెక్టర్ ఆల్బమ్‌లో, ఇతర తెలుగు, తమిళం చిత్రాల్లో ఆధునికీకరించారు. ‘అల వైకుంఠపురములో’ సినిమా కోసం ‘రాములో రాములా..’ అనే ఒరిజినల్ తెలంగాణ ఫోక్ బిట్‌ను తీసుకొన్న కాసర్ల శ్యామ్, థమన్ గ్లోబల్ సెన్సేషన్ క్రియేట్ చేశారు.
రాహుల్ సిప్లిగంజ్ ప్రైవేట్ సాంగ్‌గా పాడిన ‘పెద్ద పులి’ పాటను నితిన్ సినిమాలో రీమిక్స్ చేశారు. ‘బొంబాయి పోతావా రాజా’ పాట కూడా సినిమాల్లో వాడారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, గీతరచయిత కాసర్ల శ్యామ్ కలయికలో ‘చమ్కీల అంగీలేసి..’ అనే ఒరిజినల్ జానపద శైలి లైన్లను ‘దసరా’ సినిమా కోసం తీసుకొని సక్సెస్ అయ్యారు. మోహన భోగరాజు పాడిన ప్రైవేట్ ఫోక్ సాంగ్ ‘బుల్లెట్టు బండి’ పెళ్లిళ్లలో ఎంత వైరల్ అయిందో తెలిసిందే. ఇదే క్రేజ్‌తో రాఘవ లారెన్స్ సినిమాకు కూడా ఈ టైటిల్, సాంగ్ ఇన్స్పిరేషన్గా వాడారు.
ఉత్తరాంధ్ర జానపద గీతం ‘నక్కిలీసు గొలుసు..’ను ‘పలాస 1978’ చిత్రంలో రఘు కుంచె రీమిక్స్ చేశారు. ఇది సినిమాకు పెద్ద హైలైట్‌గా నిలిచింది. ‘విరాటపర్వం’ సినిమాలో ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్ ‘లింగిడి లింగిడి..’ని సురేశ్ బొబ్బిలి సంగీతంలో తెలుగునాట నలమూలలకు పాకింది. ‘కొర మీను’ చిత్రంలో ‘చింత చిగురు..’ అనే ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్‌ను ఈ సినిమాలో రీమేక్ చేశారు. విడుదలకు సిద్ధంగా ఉన్న ‘గరివిడి లక్ష్మి’ సినిమాలో ‘నల్ల జిలకర మొగ్గ’ అనే జానపదం ప్రేక్షకులను అలరించనుంది. ఇవే కాకుండా ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్స్‌లో వచ్చే ఎన్నో హిట్ ఫోక్ ట్యూన్స్‌ను వర్తమాన సంగీత దర్శకులు సినిమాల్లో రీమిక్స్ చేస్తూనే ఉన్నారు.
సినీరంగంలో ప్రభవించెనిలా..
తెలంగాణ జానపద గాయని ప్రభ తన అద్భుతమైన గాత్రంతో, ఎనర్జిటిక్ పల్లెపాటలతో సోషల్ మీడియా, యూట్యూబ్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ‘ఓ పిలగా వెంకటి’, ‘రాను బొంబాయికి’, ‘రింగు రింగుల జుట్టుదానా’, ‘గుజ్జరి గుజ్జరి’ వంటి పాటలు సింగర్ ప్రభను జనానికి చేరువ చేశాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగ సందర్భాల్లో ఆమె పాడిన పాటలు ఏటా భక్తులను, శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇలా సంగీత ప్రపంచంలో ఆమెకు వచ్చిన క్రేజ్ కారణంగా, ప్రస్తుతం ఆమెకు సినిమా అవకాశాలు లభిస్తున్నాయి. ఇటీవల వచ్చిన ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ‘యేష నాగుల కట్ట మీద’ పాటను పాడి టాలీవుడ్ అడుగుపెట్టారు ప్రభ.
‘కేఏ13’ కోసం రఘుకుల తిలకా..
ఈ మధ్య తెలుగులో ఫోక్ సాంగ్స్‌ను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు మేకర్స్. ‘మల్లెపూల పల్లకి’ ఇచ్చిన బ్లాక్‌బస్టర్ వైబ్ తర్వాత ఇప్పుడు మరొక డివోషనల్ ఫోక్ నంబర్ రాబోతుండటం జానపద ప్రియులను ఆనంద డోలికల్లో ముంచెత్తుతోంది. తాజాగా కిరణ్ అబ్బవరం ‘కేఏ13’ అనే వర్కింగ్ టైటిల్ రూపొందిస్తున్న సినిమా కోసం ఫోక్లో రప్ఫాడించిన ‘రఘుకుల తిలకా రారా..’ సాంగ్‌ను రీమిక్స్ చేస్తున్నారని సమాచారం. ‘ఇరుముడి’లో ‘మల్లెపూల పల్లకి’ పాట థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది.
ఇదే జోష్‌లో ఇప్పుడు ‘రఘుకుల తిలక’ రీమిక్స్‌పై సహజంగానే ఎక్కువ ఆసక్తి పెరిగింది. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో తాజా స్పెషల్ సాంగ్ ఇప్పటికే రీమిక్స్ వెర్షన్ షూటింగ్ పూర్తయిపోయిందట. ‘కే-ర్యాంప్’ చిత్రంలో ‘ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా..’ సాంగ్ తాజా ‘కేఏ13’ మూవీకి ఓ ట్రంప్ కార్డులాగా సెన్సేషన్ క్రియేట్ చేయబోతోందని చిత్ర యూనిట్ భావిస్తోంది.