మళ్ళీ కరెంట్ కష్టాలు: మాజీ మంత్రి
దామరచర్ల: తెలంగాణలో మళ్లీ విద్యుత్ కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి(Former Minister Jagadish Reddy) అన్నారు. దామరచర్ల మండలం లోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని(Yadadri Thermal Power Plant) గురువారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. 2014కు ముందు నాటి కరెంట్ కష్టాలు పునరావృతమవుతున్నాయంటూ విమర్శలు చేశారు. ఇళ్లకు పవర్ కట్స్.. పరిశ్రమలకు జనరేటర్లు.. రైతులకు డీజిల్ జనరేటర్ల దుస్థితి నెలకొంటున్నట్లు చెప్పారు. దామరచర్ల 4 వేల మెగావాట్ల ప్లాంట్ దేశంలోనే అతిపెద్దదని చెప్పారు.
బీఆర్ఎస్(BRS) హయాంలో విద్యుత్ ఉత్పత్తిని 6,700 నుంచి 21,500 మెగావాట్లకు పెంచామని వెల్లదించారు. ప్రస్తుత ప్రభుత్వం దురుద్దేశంతో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిందని ఆరోపణలు చేశారు. బొగ్గు కొరత అంటూ ప్రభుత్వం చెబుతున్న కారణాలన్నీ పచ్చి అబద్ధాలేనని చెప్పారు. రాష్ట్ర బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ రైతులకు 6 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని అన్నారు.
40 లక్షల టన్నుల బొగ్గు స్కామ్(Coal scam) జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. యాదాద్రి ప్లాంట్‌ను కావాలనే ఫెయిల్యూర్ చేసే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. అధికారులు సైతం ప్లాంట్ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని అక్రమాలు, స్కామ్‌లను ఒక్కొక్కటిగా బయటకు తీస్తామని ,
అన్ని లెక్కలు కక్కిస్తాం. ఎవరినీ వదిలిపెట్టేది లేదంటూ ఘాటు హెచ్చరిక చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సి కోటిరెడ్డి, జిల్లా అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్ నాయక్,మాజీ ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే లు కంచర్ల భూపాల్ రెడ్డి,నోముల భగత్, పైళ్ళ శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్,ప్రభాకర్ రెడ్డి,చిరుమర్తి లింగయ్య,తిప్పన విజయసింహ రెడ్డి, రాష్ట్ర నాయకులు పిల్లుట్ల రఘు,నరసింహ రెడ్డి,ఇస్లావాత్ రామచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.