బావుల బోరు మోటార్లు, ట్రాక్టర్ బ్యాటరీలు దొంగిలించిన నలుగురు నిందితుల అరెస్ట్
జనగామ,(విజయక్రాంతి): జనగామ మండలం(Jangaon mandal) గోపరాజుపల్లి గ్రామానికి చెందిన తప్పుడు కనకయ్య సెప్టెంబర్ 2న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తన పొలంలోని ట్రాక్టర్ బ్యాటరీ, బోరు మోటారును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని, తనతో పాటు గ్రామానికి చెందిన మరికొందరు రైతులకు(Farmers) సంబంధించిన 10 మోటార్లు, 3 ట్రాక్టర్ బ్యాటరీలను కూడా దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈరోజు మధ్యాహ్నం వడ్లకొండ క్రాస్ రోడ్డు(Vadlakonda Cross Road) వద్ద ఎస్ఐ భరత్, కానిస్టేబుళ్లు కరుణాకర్, కృష్ణ, భాస్కర్ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు బైకులపై వస్తున్న నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. రైతులు కెనాల్ నుండి పొలాలకు నీళ్లు పెట్టడానికి బిగించిన బోరు మోటార్లను, పొలాల్లో ఉన్న ట్రాక్టర్ల బ్యాటరీలను దొంగిలించినట్లు తెలిపారు. గోపరాజుపల్లి, తమ్మడపల్లి గ్రామాల రైతులకు చెందిన 13 బోరు మోటార్లు, 4 ట్రాక్టర్ బ్యాటరీలను దొంగిలించి అమ్మగా వచ్చిన డబ్బును పంచుకున్నట్లు ఒప్పుకున్నారు. నిందితుల వద్ద నుండి 76 వేల రూపాయల నగదు, ఒక బోరు మోటారు, 3 సెల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.






