5 September, 2026 | 10:53 PM

సమాజానికి దిక్సూచి ‘ఉపాధ్యాయుడు’

05-09-2026 | 09:03pm

పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది 

విద్యావంతుల తయారీలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది

విద్యారంగంలో పెను మార్పులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి

ఉపాధ్యాయులకు గురు పూజోత్సవ శుభాకాంక్షలు

మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్,(విజయక్రాంతి): సమాజానికి దిక్సూచి ‘ఉపాధ్యాయుడు’(teachers) అని పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ,పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయులు గురుతర భాధ్యతను నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్(Collector Pratima Singh) ఉపాధ్యాయులను కొనియాడారు. శనివారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి కార్యాలయంలో గురుపూజోత్సవ వేడుకలకు(Guru pujotsavam celebrations) జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు,  ఏ.డి శ్రీనివాసరావు, సీఎంఓ రాజు, ఏఎంఓ సుదర్శనమూర్తి, ఏ.ఎస్.ఓ నవీన్ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన, గావించి డా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్  ప్రతిమా సింగ్ మాట్లాడుతూ... 138 గురుపూజోత్సవ వేడుకలు సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. తల్లిదండ్రుల తరువాత స్థానం ఉపాధ్యాయులదేనని, గురువుకు మించిన దైవం ఈ లోకంలో లేదని పేర్కొన్నారు. విద్యా బోధనలో మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు జన్మనిస్తే, భవిష్యత్తును ఇచ్చేది గురువేనని పేర్కొన్నారు. పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయులు గురుతర భాధ్యతను నిర్వహిస్తున్నారని ఆమె అన్నారు.

పాఠశాలల అభివృద్దే ప్రభుత్వ ద్యేయమని, విద్యకు ప్రధమ ప్రాధాన్యతనివ్వడమేనని స్పష్టం చేశారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి సమాంతరంగా కృషి చేస్తున్నామని, తెలిపారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గ నిర్దేశకులు ఉపాధ్యాయులని అన్నారు. విద్యా రంగంలో విశిష్ట సేవలందించిన ఉపాధ్యాయులను గుర్తించి, సత్కరించడం ద్వారా విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. జిల్లాలోని ప్రతిభావంతమైన ఉపాధ్యాయుల సేవలను ప్రశంసిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరచడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని అభినందించారు. ఉపాధ్యాయుల మోటివేషన్ వల్లే తాను సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధం అయ్యానని. తన ఉన్నతికి దోహదపడిందని కాబట్టే తాను ఐ.ఏ.ఎస్ కాగలిగాను 

అని ఉపాధ్యాయులు  కృషిని అభినందిస్తూ, ఇదే కృషితో మన జిల్లా  ఉత్తమ ఫలితాలతో రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని  ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ(Education Department) నేతృత్వంలో విద్యా రంగం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. రాష్ర్టంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఉండగా వేలాది మంది విద్యను అభ్యసిస్తూ లబ్ధి పొందుతున్నారని అన్నారు. విద్యారంగంలో కొత్త శకం ఆవిష్కృతం అవుతుందన్నారు.  నాణ్యమైన విద్యను అందిస్తూ రేపటి తరాన్ని తీర్చిదిద్దడంలో ముందంజలో ఉందని తెలిపారు. గుణాత్మక విద్యను అందిస్తూ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ సత్ఫలితాలను ఇస్తున్నదన్నారు.

అంతకు ముందు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాధిక భూపతి రాజు తదితరులు ప్రసంగించారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయులను కొనియాడుతూ  పిల్లల భవిష్యత్తుకు మార్గ నిర్దేశం చేస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 52  మంది ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువా, మెమెంటోతో ఘనంగా సత్కరించి  అభినందనలు తెలిపారు. 

మరిన్ని వార్తలు