మద్యపాన నిషేధం సాధ్యమా?
- అక్రమ వ్యాపారానికి దారితీస్తుందా?
- వ్యసనపరులు తృష్ణను వదులుకోలేరు
- మహారాష్ట్ర కేసు విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: సంపూర్ణ మద్యపాన నిషేధం(Prohibition of alcohol) సాధ్యమా? లేకపోతే ఈ నిర్ణయం అక్రమ వ్యాపారానికి దారి తీస్తుందా? అని సుప్రీంకోర్టు(Supreme Court) ప్రశ్నలను లేవనెత్తింది. మహారాష్ట్ర(Maharashtra)కు సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా శనివారం సుప్రీంకోర్టు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ పలు ప్రశ్నలను సంధించింది. గుజరాత్(Gujarat)లో సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్నా మద్యం విషప్రయోగ విషాదాలు జరిగిన ఉదంతాలు అనేకం ఉన్నాయని పేర్కొంది. 600 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.
ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుం దని, శాంతిభద్రతల(Law and order) నిర్వహణ ఖర్చులు పెరుగుతాయని, పోలీసు, ఎక్సైజ్ శాఖలో అవినీతి పెచ్చుమీరే అవకాశం ఉందని, అక్రమ మద్యం తయారీ పెరుగుదల, దీంతో ముడిపడి ఉన్న మాదకద్రవ్యాల ముప్పు కూడా పొంచి ఉందని పేర్కొంది. గతంలో పలు రాష్ట్రాల్లో చేపట్టిన మద్య నిషేధం ప్రభావాలు, నష్టాలు వంటి నిదర్శనాలను ప్రస్తావించింది.
రంగు, రుచి మారడం వల్ల వ్యసనపరులు తమ తృష్ణను వదులు కోలేరని పేర్కొంది. ఎక్సైజ్ చట్టాలను బలోపేతం చేసి మద్యం, రవాణా, నిల్వ, తయారీపై కఠిన చర్యలు, నియంత్రణలు అమలు చేయడం ఉత్తమమన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు రాజ్యాంగబద్ధం, సహేతుకంగా లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.