మాజీ ఎంపీపీ వ్యాఖ్యలను ఖండిస్తూ జర్నలిస్టుల నిరసన
మల్లాపూర్, సెప్టెంబర్ 19(విజయక్రాంతి): మల్లాపూర్ మండలానికి చెందిన ఓ దినపత్రిక విలేకరి రుద్ర రాంప్రసాద్పై (Daily newspaper reporter Rudra Ramprasad) మాజీ ఎంపీపీ నల్ల రాజన్న అసభ్య పదజాలంతో దుర్భాషలాడిన ఘటనను ఖండిస్తూ శనివారం మండల జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఈ మేరకు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన మాజీ ఎంపీపీ నల్ల రాజన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులపై అసభ్యకరంగా మాట్లాడటం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు మండలంలోని జర్నలిస్టులు పాల్గొన్నారు.