పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనం పట్టివేత
9 ఎద్దులు స్వాధీనం.. ఇద్దరిపై కేసు
కోటపల్లి, అక్టోబర్ 3 ( విజయక్రాంతి ) : పశువులను అక్రమంగా(Cattle slaughtering) తరలిస్తున్న వాహనంపై కోటపల్లి పోలీసులు(Kotapalli Police) కోరడ విధించారు. మంచిర్యాల జిల్లా(Mancherial District) కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలోని క్రాస్‌రోడ్డు వద్ద శనివారం నిర్వహించిన వాహన తనిఖీల్లో(Vehicle Inspection) TS-21T-9507 నంబర్ గల అశోక్ లేలాండ్ వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా క్రూరంగా కట్టివేసిన 9 ఎద్దులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
పశువుల తరలింపునకు అవసరమైన చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకపోవడంతో వాహనంలోని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని కొరుట్లకు చెందిన డ్రైవర్, యజమాని మొహమ్మద్ ముబీన్ బాబా (69), పశువుల కొనుగోలుదారు అబ్దుల్ హమీద్ (32)గా గుర్తించారు. జనగామ గ్రామం నుంచి ఎద్దులను కొనుగోలు చేసి కొరుట్లకు తరలిస్తున్నట్లు వారు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పశువులను అక్రమంగా, క్రూరంగా తరలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని కోటపల్లి ఎస్సై రాజశేఖర్ హెచ్చరించారు.