దుబాయ్‌లో బతుకమ్మ వేడుకలు.. KTRకు ఆహ్వానం
హైదరాబాద్: దుబాయ్‌లో నిర్వహించే బతుకమ్మ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు ఆహ్వానం లభించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను దుబాయ్‌లో ఘనంగా నిర్వహించేందుకు గల్ఫ్ తెలంగాణ ఫోరమ్ (GTF), ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (ETCA) ఏర్పాట్లు చేస్తున్నాయి. అక్టోబర్ 11న దుబాయ్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజలతో కలిసి సంబరాల్లో పాల్గొనాలని కేటీఆర్ ను నిర్వాహకులు ఆహ్వానించారు.
GTF ఫౌండర్, అధ్యక్షుడు ఆకుల సురేందర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేటీఆర్‌ను కలిసి దుబాయ్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు సంబంధించిన ఆహ్వానపత్రాన్ని అందజేసింది. తెలంగాణ ఆడపడుచులు, ప్రవాస తెలంగాణ కుటుంబాలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని వారు కేటీఆర్‌ను ప్రత్యేకంగా కోరారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని గల్ఫ్ దేశాల్లోనూ కొనసాగించడంతో పాటు, అక్కడి తెలంగాణ సమాజంలో తమ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు GTF ప్రతినిధులు తెలిపారు.






