సమస్యల ‘భూచక్రం’!
ఆరోపణలకే పరిమితమవుతున్న భూ అక్రమాలు
- ప్రభుత్వాలు మారినా లభించని పరిష్కారం
- ధరణి, భూభారతి నుంచి 22 ఏ దాకా అదే గందరగోళం
- నిజాలు నిగ్గుతేలాలంటే విచారణే మార్గం
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): తెలంగాణలో భూముల రికార్డుల వివాదం(Land records dispute) మరోసారి రాజకీయాలకు కేంద్రంగా మారింది. రాజకీయాలు భూ అక్రమాలకు రాజమార్గంగా తయారవుతున్నాయి. ఒకప్పుడు వ్యక్తుల చుట్టూ తిరిగే భూ ఆక్రమణల(Land grabbing) ఆరోపణలు ప్రస్తుతం ప్రభుత్వలకు మాయని మచ్చగా మారుతున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి భూదాన్, అసైండ్, నిషేధిత భూముల(Bhoodan, assigned, and prohibited lands) సమస్య తెలంగాణలో కొనసాగుతున్నది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీలో రెవెన్యూ రికార్డుల ప్రస్తావనతో రాష్ట్రవ్యాప్తంగా మరింత చర్చనీయాంశమైంది.
ఒకవైపు 22- ఏ నిషేధిత భూముల జాబితా, మరోవైపు ధరణి భారతి రికార్డులపై ఆరోపణలు.. మధ్యలో తమ భూములపై హక్కులు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోలేక, బ్యాంకు రుణాలు పొందలేక, ఆస్తులను విక్రయించలేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్న భూయజమానులు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు కేవలం రెవెన్యూ శాఖ సమస్యగా కాకుం డా భూమి హక్కులు, రికార్డుల పారదర్శకత, ప్రభుత్వ బాధ్యత, అధికారుల జవాబుదారీతనం వంటి అంశాలతో ముడిపడింది.
ప్రభుత్వం మాత్రం 22 -ఏ వివాదం కొత్తగా పుట్టిన సమస్య కాదని, గతంలో ఏర్పడిన రికార్డుల గందరగోళం వారసత్వంగా వచ్చిందని చెబుతోంది. నిషేధిత జాబితాలో ఉన్న భూముల పరిమాణం తమ హయాంలో పెరగలేదని, పైగా కొంత మేర తగ్గిందని గణాంకాలతో వివరిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత కూడా ప్రైవేటు భూములు నిషేధిత జాబితాలో చేరాయని ఆరోపిస్తూ, సిట్టింగ్ హైకో ర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది. దీంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అనేక రెవెన్యూ సమస్యలకు కారణమైన 22 ఏ అంశానికి పరిష్కారం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వ లెక్కల్లో ఏముంది?
ప్రభుత్వ గణాంకాల ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో 22 -ఏ కింద మొత్తం 1,02,52,690 ఎకరాలు ఉన్నాయి. ఇందులో 96,61,026 ఎకరాలు ప్రభుత్వ భూములు, 3,95,852 ఎకరాలు ప్రైవేటు భూములు(Private lands) ఉన్నాయి. 2026 ఆగస్టు 30 నాటికి మొత్తం నిషేధిత భూముల విస్తీర్ణం 1,02,05,250 ఎకరాలకు తగ్గిందని ప్రభుత్వం తెలిపింది. అంటే మొత్తం జాబితాలో 47,440 ఎకరాల తగ్గుదల నమోదైంది. తాజా లెక్కల్లో ప్రభుత్వ భూములు 96,36,777 ఎకరాలు, ప్రైవేటు భూములు సుమారు 3.74 లక్షల ఎకరాలు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
2017 నుంచి 2025 మధ్యకాలంలో 22 -ఏ కింద నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని కోరుతూ హైకోర్టులో 28,611 కేసులు దాఖలయ్యాయని రెవెన్యూ మంత్రి అసెంబ్లీలో తెలిపారు. ఈ సంఖ్యను కేవలం కేసుల గణాంకంగా చూడలేమన్న వాదన ఉంది. ఎందుకంటే భూమి రికార్డుల్లో చిన్న తప్పిదం జరిగినా దాని ప్రభావం ఆ భూమి యజమాని కుటుంబంపై నేరుగా పడుతుంది. ఆస్తి విక్రయం, రిజిస్ట్రేషన్, బ్యాంకు రుణం, పెట్టుబడి, వారసత్వ బదలాయింపు వంటి అనేక అంశాలు నిలిచిపోవచ్చు.
ఇదే కారణంగా 22 -ఏ జాబితాలో ఉన్న భూములపై సర్వే నంబర్ వారీగా స్పష్టమైన సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండాలన్న అంశం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆగస్టులోనే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారుల స్థాయిలో భూ రికార్డుల అప్డేట్లో తప్పిదాలు జరిగాయని అంగీకరించి, ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు క్షమాపణలు తెలిపారు. 22 -ఏ కింద చేరిన భూముల సమస్యలను పరిశీలించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, వారానికి ఒకసారి సమావేశమై దరఖాస్తులను పరిశీలించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
అనేక ఏళ్లుగా సమస్యలే..
తెలంగాణలో భూ సమస్యలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. భూదాన్ ఉద్యమం ద్వారా భూమిలేని పేదలకు భూములు అందించే ప్రయత్నాల నుంచి మొదలుకొని, ప్రభుత్వ అసైండ్ భూముల పంపిణీ, ఆక్రమణలు, అక్రమ బదలాయింపులు వరకు భూమి అంశం ఎప్పటికప్పుడు రాజకీయ చర్చలో నిలిచింది. భూదాన్ భూముల విషయంలో యాజమాన్య హక్కులు, రికార్డులపై వివాదాలు కొనసాగగా, అసైండ్ భూముల విషయంలో పేదలకు కేటాయించిన భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లాయన్న ఆరోపణలు వివిధ సందర్భాల్లో రాజకీయంగా తెరపైకి వచ్చాయి. అనంతరం ప్రభుత్వ భూములు, వక్ఫ్, దేవాదాయ భూములు, 22 ఏ నిషేధిత భూములు కూడా రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారాయి.
దీనికి కొనసాగింపుగా ధరణి పోర్టల్‌లో భూ రికార్డుల మార్పులు, పట్టాదారు పాస్‌బుక్‌లు, మ్యుటేషన్లు వంటి అంశాలపై వివాదాలు తలెత్తాయి. ప్రస్తుతం భూ భారతి, 22 ఏ జాబితా చుట్టూ జరుగుతున్న చర్చ కూడా గతంలో పేరుకుపోయిన భూ రికార్డుల సమస్యలకు కొనసాగింపుగానే కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో తలెత్తిన వివాదం నేపథ్యంలో 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు ఏ సర్వే నంబర్లో ఎలాంటి మార్పు జరిగింది అన్నది అధికారికంగా అందుబాటులోకి వస్తేనే ఈ ఆరోపణలకు పూర్తి సమాధానం లభిస్తుందది.
పరిష్కారం కోరుతున్న ప్రజలు
-22- ఏ వివాదం రాజకీయ ఆరోపణలకు మాత్రమే పరిమితం కాలేదు. భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయన్న కారణంతో రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు, ఆస్తుల బదలాయింపులు నిలిచిపోయాయి. దీంతో ఎంతో మంది సామాన్యులు బాధితులయ్యారు. ఇటీవల తెలంగాణ భవన్‌ను ఆశ్రయించిన కొందరు భూయజమానులు తమ భూములు 22- ఏ జాబితాలో చేరడంతో రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు, ఇతర ఆర్థిక లావాదేవీలు ప్రభావితమయ్యాయని ఆరోపించారు.
అయితే ఇలాంటి ఫిర్యాదుల సంఖ్య పెరుగుతున్నప్పుడు.. ప్రభుత్వం రూపొందించిన పరిష్కార వ్యవస్థ ఎంత వేగంగా పనిచేస్తోంది? అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. ఈ క్రమంలో తమ భూమి తమదేనని నిరూపించుకోవడానికి ప్రజలే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలా? లేక ప్రభుత్వం తన వద్ద ఉన్న రికార్డులను సరిచేసి, హక్కుదారుడి భూమికి స్వయంగా రక్షణ కల్పించాలా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 22 ఏ అంశంతో ఒకవైపు బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోవైపు పార్టీల మధ్య రాజకీయ పోరుగా మారింది.
దీంతో 22- ఏ వివాదం ఇప్పుడు ఒక రాజకీయ అంశాన్ని మించి భూమి హక్కుల పరిరక్షణకు సంబంధించిన పరిపాలనా పరీక్షగా మారింది. ఒకవైపు ప్రభుత్వం 22- ఏ జాబితాలోని మొత్తం భూమి విస్తీర్ణం తగ్గిందని చెబుతోంది. మరోవైపు ప్రతిపక్షం ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరిగిన మార్పులపై ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం తప్పిదాలను సరిచేస్తామని చెబుతోంది. ప్రతిపక్షం స్వతంత్ర న్యాయ విచారణ కోరుతోంది. హైకోర్టు కూడా నిషేధిత భూముల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది.
ఈ క్రమంలో 22- ఏ జాబితా సవరణ, భూ భారతి అమలు, డిజిటల్ రికార్డుల ప్రక్షాళన వంటివి సమన్వయంతో జరిగితేనే భూముల వివాదానికి దీర్ఘకాలిక పరిష్కారం సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా 22 ఏ భూ అక్రమాలపై రాజకీయ ఆరోపణలు కాకుండా ఏ సర్వే నంబర్లో ఏ తప్పు జరిగింది?, దాన్ని ఎవరు చేశారు? ఎప్పుడు, ఎందుకు చేశారు?, ఆ తప్పును ఎప్పుడు సరిచేశారు?, బాధితుడికి ఎప్పుడు న్యాయం జరిగింది? అన్న ప్రశ్నలకు రికార్డు ఆధారంగా సమాధానం రావడమే కీలకంగా మారింది.
విచారణలో తేల్చాల్సిన అంశాలు..
* 1999 నుంచి ఇప్పటి వరకు జాబితాలో జరిగిన మార్పుల పూర్తి రికార్డు
* ఎప్పుడు, ఎవరి ఆదేశంతో, ఏ కారణంతో ఒక భూమిని చేర్చారు లేదా తొలగించారు?
* ఒకే సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి ఉంటే వాటిని ఎలా వేరు చేశారు?
* తప్పుగా ప్రైవేటు భూమిని 22- ఏలో చేర్చితే.. ఆ తప్పిదానికి బాధ్యత ఎవరిది?
* తప్పిదాలకు బాధ్యులైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
* ప్రస్తుతం ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి? వాటిలో ఎన్ని పరిష్కరించారు?
* 22- ఏ కారణంగా ఎన్ని రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి? వాటిలో ఎన్ని తర్వాత పూర్తయ్యాయి?
* ప్రతి పౌరుడు తన భూమి స్థితిని ఆన్లైన్లో స్వయంగా తెలుసుకునే అవకాశం ఉందా?