భూ రీ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలి
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్
- బూర్గంపాడు మండలం అంజనాపురం ప్రాంతంలో డిజిటల్ భూ రీ సర్వే పనుల పరిశీలన
బూర్గంపాడు, (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లాలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను శనివారం జిల్లా కలెక్టర్ అంకిత్ (District Collector Ankit) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అందులో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను వినియోగిస్తూ చేపడుతున్న డిజిటల్ భూ రీ సర్వే ప్రక్రియను బూర్గంపాడు మండలంలోని పినపాక పట్టీ నగర్ రెవెన్యూ విలేజ్ అంజనాపురం ప్రాంతంలో డిజిటల్ భూ రీ సర్వే పనులను శనివారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సర్వేలో అనుసరిస్తున్న విధానం, భూముల కొలతలు, వివరాల నమోదు తదితర అంశాలను బూర్గంపాడు తహసీల్దార్ ప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటివరకు పూర్తయిన సర్వే పనుల పురోగతిపై సమీక్షించి, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత లైసెన్సు సర్వేయర్లు యుగేందర్,అనూష లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ క్రమంలో 118 సర్వే నెంబర్ లో 1863 ఎకరాలకు గాను 1698 ఎకరాలు రీ సర్వే పూర్తయిందని జిల్లా కలెక్టర్ కు సర్వేర్లు తెలియజేశారు. అటవీశాఖకు సంబంధించిన భూములు సుమారు 200 ఎకరాలు ఉండగా వాటికి అనుమతులు వస్తే సరిహద్దులు సర్వే పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ కు సర్వేయర్లు తెలిపారు.
అనంతరం స్థానిక రైతులు తమ్మినేని వెంకటేశ్వర్లు, తిరుపతయ్య,కొట్టే వెంకటేశ్వర్లు భానోత్ రాజు, దాసరి ఆదినారాయణ జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడి భూ రీ సర్వేకు సంబంధించి వారి అభిప్రాయాలు, సమస్యలు, సందేహాలను అడిగి తెలుసుకున్నారు. సర్వే సమయంలో భూ యజమానులు తమ భూములకు సంబంధించిన వివరాలను అధికారులకు అందించి సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్న రీ సర్వే ద్వారా భూముల వివరాలు మరింత కచ్చితంగా నమోదు కావడంతో పాటు భవిష్యత్లో భూ సంబంధిత సమస్యలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ పరిశీలనలో పినపాక పట్టీ నగర్ సర్పంచ్ బాణోత్ పద్మ,ఉప సర్పంచ్ వెంకటరమణ, అధికారులు, సిబ్బంది, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.