కలంతోనే కాదు.. రక్తంతోనూ ప్రాణరక్షణ !
- టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి సేవా సంకల్పం
- ఈనెల 22న సంగారెడ్డి ఐబీలో భారీ రక్తదాన శిబిరం
సంగారెడ్డి, సెప్టెంబర్ 19: తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే - ఐజేయు) (Telangana State Union of Working Journalists) సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ఏ కే ఫైసల్, జిల్లా ముఖ్య నేతలు పాల్గొంటున్నారు.ఈ నెల సెప్టెంబర్ 22వ తేదీన సంగారెడ్డి స్థానిక ఐబీ ప్రాంగణంలో ఈ శిబిరం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది.
పుట్టినరోజు వేడుకలను కేవలం వ్యక్తిగత కార్యక్రమంగా కాకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్వహించాలనే సంకల్పంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, రక్తదాన ప్రాధాన్యతను గుర్తించి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.
యువత, జర్నలిస్టులు భాగస్వాములు కావాలి..
సంపూర్ణ ఆరోగ్యవంతులైన యువత, పాత్రికేయ మిత్రులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంతో పాటు సామాజిక సేవలో భాగస్వాములు కావచ్చని వివరించారు. రక్తదానం చేయదలచిన వారు సకాలంలో హాజరై ప్రాణదాతలుగా నిలవాలని నిర్వాహక వర్గం కోరింది.