మహిళల కోసం మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాం
ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్నగర్ (విజయ క్రాంతి) : మహిళల ఆత్మగౌరవం(Women's Self-Respect), ఐక్యతకు ప్రతీకగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని(Mahila Samakhya Building) మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Yennam Srinivas Reddy) అన్నారు. నగరంలోని మర్లు ప్రాంతం ఎంప్లాయీస్ కాలనీలో ఎస్డీఎఫ్, ముడా, మున్సిపల్ నిధులతో రూ.65 లక్షల వ్యయంతో నిర్మించిన భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో మర్లు ప్రాంతంలోని పలు కాలనీలకు సరైన రహదారులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, గత రెండున్నరేళ్లలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు రూ.100 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టినట్లు తెలిపారు. నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ.603 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టామని, శాశ్వత తాగునీటి పరిష్కారం కోసం రూ.220 కోట్లతో 14 ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
మహిళలు ఈ భవనాన్ని తమ సొంత ఇంటిలా భావించి పరిశుభ్రంగా నిర్వహించుకోవాలని కోరారు. మహిళల సామాజిక ఐక్యత, సాధికారతకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. చేశారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, మైత్రి యాదయ్య, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంజీవరెడ్డి, కార్పొరేటర్లు సువర్ణ కిషన్ నాయక్, గుముడాల రాధ గోవర్థన్ గౌడ్, సిబి పూజిత, సల్మాన్, రఘు, తాహెర్, నాయకులు గంగిరెడ్డి, కంచి లక్ష్మణ్, చంద్రమౌళి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామాంజుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.