మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలి
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
ఆలేరు, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) తెలిపారు.
ఈ నెల 19వ తేదీన కోదాడలో తన ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో పారిశ్రామికవేత్తలు, విద్యాసంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మంత్రి వివరించారు. నీటిపారుదల రంగంలో గంధమల్ల చెరువు, బస్వాపురం ప్రాజెక్టులకు స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే సాగునీటి రంగంలో మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నియోజకవర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, ఇద్దరికీ రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు.
కోదాడలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాలో వివిధ పరిశ్రమలు, సంస్థలు యువతకు అందించనున్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో జాబ్ మేళాలో పాల్గొనేలా ప్రజాప్రతినిధులు, అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా ఎస్పీ అక్షంశ్ యాదవ్, అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి-రవికుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తి, అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.