అప్పుల భారం.. మనోవేదనతో వ్యక్తి ఆత్మహత్య..

24-09-2026 | 08:54pm

సిద్దిపేట రూరల్, సెప్టెంబర్ 24: అప్పుల భారం, తీవ్ర మనోవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు(Suicide of a person) పాల్పడిన విషాద ఘటన సిద్దిపేట రూరల్ మండలం నారాయణరావుపేటలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాసరి గణేష్ (38) దాబాలో వంటమనిషిగా పనిచేసేవాడు. గత రెండు నెలలుగా దాబా మూతపడటంతో ఖాళీగా ఉంటున్న ఆయన మద్యానికి అలవాటు పడి, కొంతకాలంగా మానసిక ఆందోళనతో బాధపడుతున్నాడు.

గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన గణేష్ కోసం కుటుంబ సభ్యులు గాలించగా, మేకలబండ ప్రాంతంలోని అంగన్‌వాడీ కేంద్రం సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పుల భారం కారణంగా తీవ్ర మనోవేదనకు గురై ఈ ఘటనకు పాల్పడినట్లు మృతుడి భార్య పద్మ ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు సిద్దిపేట రూరల్ ఎస్‌ఐ డి. నవత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు