సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి.. రైస్ మిల్లర్ల మహాధర్నా

10-09-2026 | 03:26pm

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెరుమాళ్ల తిరుపతి

కలెక్టరేట్ ఎదుట రైస్ మిల్లర్ల మహాధర్నా

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రైస్ మిల్లింగ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా మొత్తం మిల్లర్లను డిఫాల్టర్లుగా చిత్రీకరించడం సమంజసం కాదని జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెరుమాళ్ల తిరుపతి, గౌరవ అధ్యక్షుడు కోరే రవి అన్నారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట గురువారం ఏర్పాటు చేసిన మహాధర్నాలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గత పదేళ్లలో మిల్లర్లకు కేటాయించిన 9.70 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యంలో డిఫాల్ట్ అయినది 2 శాతానికి కూడా తక్కువేనని తెలిపారు. స్వల్ప శాతాన్ని చూపించి మొత్తం పరిశ్రమపై నిందలు వేయడం సరికాదని అన్నారు. గోదాముల్లో స్థలం లేదు, మిల్లుల్లో నిల్వలు పేరుకుపోయాయని అయినా విధాన నిర్ణయాల్లో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. ముడి బియ్యం కోసం అదనంగా కేటాయించిన 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ముడి బియ్యంగా డెలివరీ చేయడం సాధ్యం కాదని, ఉడికించిన బియ్యంగా మార్చేందుకు అనుమతించాలని లేదంటే వేలం వేయాలని కోరారు.

అకాల వర్షాలు, తేమ తగ్గడం, ధాన్యం సహజ నాణ్యత క్షీణత వంటి కారణాలతో మిల్లింగులో  నష్టాలు ఉంటాయని, ఆ నష్టాలను భౌతిక తనిఖీల్లో నమోదు చేయకుండా మిల్లర్లపై బకాయిలు, డిఫాల్ట్‌ల భారం మోపడం అన్యాయమని అన్నారు. ఓటీఆర్ పై శాస్త్రీయ ఆధారం(Scientific basis for OTR) ఎక్కడ అని ప్రశ్నిస్తూ సీఎఫ్టిఆర్ఐ నిర్వహించిన మిల్లింగ్ పరీక్షల నివేదికలను(Milling test reports) ప్రభుత్వం బహిర్గతం చేయాలని, రాబోయే సీజన్ నుంచి ఆ నివేదికల ఆధారంగానే వోటిఆర్  అమలు చేయాలని కోరారు. పీడీఎస్ సన్నబియ్యం డెలివరీలోనూ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. మిల్లర్లను నిందించడం మాని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యానం సంతోష్ సెక్రటరీ , రవీందర్ రెడ్డి ట్రెజరర్, రాజు, సదానందం, బిక్షపతి, మహేందర్, శ్రీధర్, విజేందర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు