6 September, 2026 | 3:31 PM

క్రీడలతో మానసిక ఉల్లాసం

06-09-2026 | 01:00pm

మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్

ఉత్సాహంగా కొనసాగుతున్న కిడ్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్

అమీన్‌పూర్, సెప్టెంబర్ 06: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం, అమీన్‌పూర్ సర్కిల్(Ameenpur Circle) పరిధిలోని బీరంగూడ డివిజన్ జయలక్ష్మి నగర్‌లో గల ఇన్‌ఫినిట్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో చిన్నారుల కోసం నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ టోర్నమెంట్(Kids' Badminton Tournament) అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది.  ఈ క్రీడా పోటీలకు అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

పోటీల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ఆయన బహుమతులు అందజేసి ప్రోత్సహించారు. అనంతరం పిల్లల్లో మరింత జోష్ నింపుతూ స్వయంగా రాకెట్ పట్టి వారితో కలిసి కోర్టులోకి దిగి బ్యాడ్మింటన్ ఆడారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు, అకాడమీ యాజమాన్యం నందారం నరసింహ గౌడ్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నందారం నరసింహ గౌడ్ మాట్లాడుతూ "నేటి రోజుల్లో పిల్లలు సెల్‌ఫోన్లు, టీవీలకే పరిమితం కాకుండా ఇలా ఆటస్థలాల్లోకి రావడం ఎంతో సంతోషకరం.

నిత్యం షటిల్ బ్యాడ్మింటన్ ఆడటం వల్ల పిల్లలకు చక్కటి వ్యాయామం లభించి శారీరక దృఢత్వం, ఫిట్‌నెస్ పెరుగుతాయి. ఆటల వల్ల చదువులో కూడా ఏకాగ్రత, చురుకుదనం అలవడతాయి. గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం ఆటల ద్వారానే వస్తుంది. చిన్నతనం నుంచే పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఇంత మంది చిన్నారులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతూ, ఈ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఇన్‌ఫినిట్ బ్యాడ్మింటన్ అకాడమీ యాజమాన్యానికి, నిర్వాహకులకు నా ప్రత్యేక అభినందనలు. ఇక్కడి చిన్నారులు భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి మన ప్రాంతానికి మంచి గుర్తింపు తీసుకురావాలి అని ఆకాంక్షించారు.

అనంతరం టోర్నమెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ.. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి, స్వయంగా పిల్లలతో కలిసి ఆడి వారిలో ఉత్సాహం నింపిన మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. పిల్లల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకే ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం పోటీలు ఎంతో రసవత్తరంగా సాగుతున్నాయి. తల్లిదండ్రులు, స్థానికుల సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని క్రీడా పోటీలను నిర్వహిస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్, అకాడమీ కోచ్‌లు, నిర్వాహకులు, స్థానిక కాలనీ పెద్దలు, క్రీడాకారుల తల్లిదండ్రులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు