20 August, 2026 | 8:59 AM

మంథని అభివృద్ధే లక్ష్యం.. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా

20-08-2026 08:27 AM

పదిహేనేళ్లలో జరగని అభివృద్ధిని.. తక్కువ సమయంలో చేసి చూపించాం

మంథని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా పనిచేస్తున్నాం

ఎన్నికల హామీలన్నీ నెరవేర్చిన తర్వాతే మళ్లీ ఎన్నికల్లో పోటీ

మంథని లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మంథని, ఆగస్టు 20 (విజయక్రాంతి): మంథని నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. బుధవారం మంథని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. గత పదిహేనేళ్లలో జరగని అభివృద్ధిని తక్కువ సమయంలోనే చేసి చూపించామని అన్నారు. మంథని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.

రూ.800 కోట్లతో రహదారుల అభివృద్ధి

మంథని నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి రూ.800 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మంథని పట్టణం నుంచి గోదావరి వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణంతో పట్టణ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు.

మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి

విద్య, వైద్యం, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలను గుర్తించి నిధులు మంజూరు చేస్తున్నామని, అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.

హామీలు పూర్తిచేసిన తర్వాతే ఎన్నికల్లో పోటీ

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చడమే తన ప్రధాన లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా నిరంతరం పనిచేస్తానని తెలిపారు. ఇచ్చిన హామీలను పూర్తి చేసిన తర్వాతే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మంథని నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారని మంత్రి పేర్కొన్నారు.