19 August, 2026 | 1:47 AM

అగ్నిమాపక భద్రతలో ఆధునిక సాంకేతికత

19-08-2026 12:20 AM

ప్రొవిజనల్ ఎన్‌ఓసీ విధానంపై హైదరాబాద్‌లో వర్క్‌షాప్

హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణకు అనుగుణంగా అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను మరింత ఆధునికీకరించడంతో పాటు, నియంత్రణపరమైన అడ్డంకులను తొలగించే లక్ష్యంతో హైదరాబాద్‌లో ప్రొవిజనల్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) విధానం, నూతన తరం అగ్నిమాపక భద్రతా సాంకేతికతలపై వర్క్‌షాప్ నిర్వహించారు. క్రెడాయ్ హైదరాబాద్, నరెడ్కో తెలంగాణ, ఎఫ్‌ఎస్‌ఏఐ హైదరాబాద్ చాప్టర్, తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన,

అగ్నిమాపక సేవల శాఖ, తెలంగాణ ప్రభుత్వం సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఎత్తున నివాస భవనాలు, రిటైల్ సంస్థలు, ఆసుపత్రులు, హోటళ్లు, పాఠశాలలు, వాణిజ్య భవనాల్లో అగ్నిమాపక, ప్రాణ భద్రతా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, అదే సమయంలో అనుమతుల ప్రక్రియలో ఉన్న సమస్యలను తొలగించడంపై చర్చించారు. రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు, ఆర్కిటెక్టులు, స్ట్రక్చరల్ ఇంజినీర్లు, ఎంఈపీ కన్సల్టెంట్లు, ఫైర్ సేఫ్టీ నిపుణులు, ఆడిటర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2026 ఉపసంహరణ, నేషనల్ బిల్లిండ్ కోడ్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ స్టాండర్డ్స్ 2026 అడ్వైజరీ ప్రమాణాల పరిచయం నేపథ్యంలో తెలంగాణ అగ్నిమాపక శాఖ కొత్త డ్రాఫ్ట్ ప్రొవిజనల్ ఎన్వోసీ డాక్యుమెంట్లను రూపొందించింది. ఇందులో రెసిడెన్షియల్, బిజినెస్, మెర్కంటైల్, ఎడ్యుకేషనల్ భవనాలకు ఉపయోగపడే ప్రాక్టికల్ చెక్లిస్టులను రూపొందించారు. రిస్క్ ఆధారిత ఈ విధానం ద్వారా ఫైర్, లైఫ్ సేఫ్టీ నిబంధనల్లో ఏకరూపత తీసుకురావడంతో పాటు, పునరావృతమైన, అవసరం లేని నిబంధనలను తొలగించి రాష్ట్రంలో ‘ఈజ్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

అదేవిధంగా ఫైర్ పంపుల స్థితి, నీటి మట్టాలు, జనరేటర్ సిద్ధంగా ఉన్న స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఐఓటీ ఆధారిత హెల్త్ మానిటరింగ్ సెన్సర్లు, ప్రెషర్లెస్ ఏరోసోల్స్, ఆధునిక స్మోక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ను కూడా ప్రదర్శించారు. కార్యక్రమంలో విక్రమ్ సింగ్ మాన్ (తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్), క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్. జైదీప్ రెడ్డి, నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి కొప్పుల, ఎఫ్‌ఎస్‌ఏఐ హైదరాబాద్ అధ్యక్షుడు మనోజ్ వాహి పాల్గొన్నారు.