మేడిగడ్డ కేసును ఎలా మూసేస్తారు?
- కరువుకు రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యమే కారణం
- కాఫర్ డ్యాం నిర్మిస్తే పంటలకు నీరందేది
- బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై నమోదైన కేసును పోలీసులు ఎలా మూసివేస్తారని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్(BRS General Secretary R.S. Praveen Kumar) ప్రశ్నించారు. బరాజ్ దెబ్బతినడానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపకుండా కేసును అన్‌డిటెక్టెడ్‌గా ముగించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆర్‌ఎస్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులకు ప్రభుత్వ ప్రధాన కారణమని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సక్రమంగా పనిచేసి ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు కొంతమేర ఉపశమనం కల్పించే అవకాశం ఉండేదన్నారు. మేడిగడ్డ బరాజ్‌లోని ఏడో బ్లాక్ పిల్లర్ కుంగిపోయిన ఘటనపై 2023 అక్టోబర్ 21న ఇంజనీర్ రవికాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని, అయితే ఈ కేసులో సమగ్ర విచారణ జరగకుండానే 2025లో అన్‌డిటెక్టెడ్‌గా క్లోజ్ చేసినట్లు పేర్కొన్నారు. అందుకు గల కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని కోరారు.
మేడిగడ్డ వద్ద సుమారు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లతో కాఫర్ డ్యాం నిర్మించి ఉంటే నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉండేదని, నిర్మాణానికి సుమారు 50 రోజులు పట్టేదని పేర్కొన్నారు. రోజుకు 1.4 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు. కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టకపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ఉన్నాయని ఆరోపిం చారు. యాసంగి పంటలు వేయవద్దంటూ సీఎం మాట్లాడటం రైతుల్లో ఆందోళన పెంచుతోందని అన్నారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నివేదికను ప్రస్తావిస్తూ, రాబోయే రోజుల్లో సుమారు రూ.25 వేల కోట్ల మేర పంట నష్టం సంభవించే ప్రమాదం ఉందని తెలిపారు. కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.