ప్రజావాణిలో తల్లి ఫిర్యాదు
మెట్ పల్లి,(విజయక్రాంతి): మున్సిపల్ పరిధిలోని ఆరపేటకు చెందిన చౌటుపల్లి సత్తమ్మ తనను ఇద్దరూ కొడుకులు, కూతురు ఉన్న పట్టించుకోవడం లేదని ప్రజావాణి(Prajavani)లో ఫిర్యాదు చేసింది. సత్తమ్మ భర్త మూడు సంవత్సరాల క్రితం మృతి చెందారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఇద్దరు కుమారులు వివాహం అనంతరం వేరువేరుగా నివసిస్తున్నారు. వారసత్వంగా వచ్చిన ఆరు ఎకరాల భూమిని కుమారులకు చెరి సగం ఇచ్చినట్లు ఆమె తెలిపారు. తన పేరుపై ఉన్న మరో రెండు ఎకరాల 15 కుంటల భూమిని కూడా కుమారులు తమ పేర్లపైకి మార్చుకున్నారని వాపోయారు.
భూమిని తమ పేర్ల పైకి మర్చితే తనకు చెరో లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తామని, నెలనెలా నిత్యావసర సరుకులు అందిస్తామని వారు హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. అయితే ఇప్పటివరకు డబ్బులు డిపాజిట్ చేయకపోవడంతో పాటు సరుకులు కూడా అందించడం లేదని సత్తమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను ఒంటరిగా ఉంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తెలిపారు.ఈ విషయమై నిన్న కుమారులను ప్రశ్నించగా, తనపై దాడి చేసి కొట్టారని ఆమె పేర్కొన్నారు. దీంతో ప్రజావాణి కార్యక్రమానికి హాజరై తన పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. తనను ఆదుకునేలా, కుమారులు తన పోషణ బాధ్యత తీసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను సత్తమ్మ వేడుకున్నారు.
