పిఎం సూర్యఘర్ సేవా-సేతు అవగాహన
నిర్మల్,(విజయక్రాంతి): పీఎం సూర్యఘర్ సేవా సేతు(PM Surya Ghar Seva Setu) కార్యక్రమాలపై జిల్లాలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా విద్యుత్ శాఖ(Electricity Department) పర్యవేక్షక ఇంజనీర్ రమేష్ తెలిపారు. కేంద్ర నూతన పునరుద్ధరణీయ ఇంధన మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వము, టీజీఎన్పీడీసీఎల్, టీజీరెడ్కో లు సంయుక్తంగా సేవా సేతు కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలు, విద్యుత్ వినియోగదారుల్లో సోలార్ విద్యుత్ పై విస్తృత ప్రచారం కల్పించడానికి నడుం బిగించాయి.
అక్టోబర్ 1 నుండి 3 వరకు మూడు రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని డివిజన్ కేంద్రాల్లో స్టాళ్లు ఏర్పాటు చేసి సోలార్ ఫలకాలు ఇంటిపై ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న ఉత్సాహవంతుల స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ(NPDCL SE) పేర్కొన్నారు. మూడు కిలోవాట్ల సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకొంటే రూ.78 వేల సబ్సిడీ పొందవచ్చని, ఇకపై ఇంటి కరెంట్ వాడకం పై జీరో బిల్లు సదుపాయం పొందవచ్చని తెలిపారు.
ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్ , నిర్మల్ , మంచిర్యాల , కె బి ఆసిఫాబాద్ , విద్యుత్ డివిజన్ కార్యాలయాల ఆవరణలో ఈ సదస్సులు జరుగుతాయని, ఇందులో బ్యాంకర్లు, సోలార్ వెండర్లు, డిస్కం, రెడ్కో అధికారులు పాల్గొంటారని, కావున వినియోగదారులు లబ్దిపొందాలని కోరారు.