కల్లు గీత కార్మికులకు వృత్తి పెన్షన్ తక్షణమే మంజూరు చేయాలి...
మంత్రి సీతక్కకు కల్లుగీత కార్మిక సంఘం విజ్ఞప్తి
గోవిందరావుపేట, సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): ఏజెన్సీలో (Agency)ఏ వృత్తిదారులకు లేని అడ్డంకులు కేవలం గీత కార్మికులకు (Geeta workers)మాత్రమే విధిస్తున్నారని కళ్ళు గీత కార్మిక సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలో 2001 సంవత్సరం నుండి ఏజెన్సీ పేరుతో 25 కల్లు గీత సొసైటీలు రద్దు కావడం జరిగిందని, అప్పటినుండి గీత కార్మికులకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ (Burra Srinivas Goud, District Secretary of the Labor Union) ఆవేదన వ్యక్తం చేశారు.
గోవిందరావు పేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో రిటైర్డ్ ఎంప్లాయ్ కొత్త మల్లయ్య గౌడ్ అధ్యక్షతన శనివారం కల్లుగీత కార్మికుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఏజెన్సీ పేరుతో జిల్లాలో 25సొసైటీలు రద్దు కావడంతో తాటిచెట్ల పై నుండి పడిన బాధితులకు ప్రభుత్వం నుండి ఎటువంటి ఎక్స్ గ్రేషియాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వృత్తి పింఛన్ 350 జీవో ప్రకారం 50 సంవత్సరాల నిండిన ప్రతి గీత కార్మికునికి రావాల్సి ఉండగా అది కూడ రావడం లేదని ఈ విషయంలో మంత్రి సీతక్క స్పందించి 50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికునికి వృత్తి పింఛన్ అందేలా అధికారులను ఆదేశించాలని శ్రీను వాస్ గౌడ్ కోరారు.
ములుగు జిల్లాలో ఏ వృత్తిదారులకు లేని పింఛన్ సమస్య కేవలం ఏజెన్సీ లో అనాదిగా గీత వృత్తి చేస్తున్నా గీత కార్మికులకే ఉందని ఆయన అన్నారు. కులం సర్టిఫికెట్ ఆధారంగా 50 సంవత్సరాలు నిండిన వారందరికీ వృత్తి పింఛన్ మంజూరు చేయాలని ఈ సందర్భంగా సీతక్కను గీత కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట మండల అధ్యక్షుడు రుద్రబోయిన మల్లేష్ గౌడ్, కార్యదర్శి వత్సవాయి సారయ్య గౌడ్, సంఘం సీనియర్ నాయకులు కాసగాని బిక్షం గౌడ్, గోవిందరావు పేట సోసైటీ అధ్యక్షులు కాసగాని స్వామి గౌడ్, బోలగాని చెంద్రయ్య గౌడ్, సీనియర్ నాయకులు కందుల బాబు గౌడ్, బండి రాజశేఖర్ గౌడ్ తో పాటు 20 మంది గీత కార్మికులు పాల్గొన్నారు.