సెంచరీకి చేరువలో ఉల్లి...!
బహిరంగ మార్కెట్లో కిలో రూ.70 నుంచి రూ.80 వరకు
ఎల్నినో, వర్షాభావ ప్రభావంతో పైపైకి ధరలు
సామాన్యుడి వంటింటిపై పెరుగుతున్న భారం
ఉల్లి ధరలతో కన్నీళ్లు తెప్పిస్తున్న పరిస్థితి
మణుగూరు, సెప్టెంబర్ 9,( విజయ్ క్రాంతి): “ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు” పెద్దలు. కానీ ప్రస్తుతం ఆ ఉల్లే సామాన్యుల కంట కన్నీళ్లు తెప్పిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే భారంగా మారిన తరుణంలో ఉల్లి ధరలు కూడా రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.70 నుంచి రూ.80 వరకు పలుకుతున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. ధరలు ఇదే విధంగా కొనసాగితే త్వరలోనే కిలో ఉల్లి ధర రూ.100కు చేరే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, పంట దిగుబడులు తగ్గడం వంటి కారణాలతో మార్కెట్లో ఉల్లి సరఫరాపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. మరోవైపు రవాణా, నిల్వ ఖర్చులు పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి లేకుండా అనేక రకాల వంటకాలు పూర్తి కావు. దీంతో ధర ఎంత పెరిగినా కొనుగోలు చేయక తప్పని పరిస్థితి వినియోగదారులకు ఏర్పడింది. గతంలో కిలోల కొద్దీ కొనుగోలు చేసిన ఉల్లిని ఇప్పుడు ధర చూసి పరిమితంగా కొనుగోలు చేయాల్సి వస్తోందని సామాన్యులు వాపోతున్నారు.
ఇప్పటికే కూరగాయలు, పప్పులు, నూనెలు తదితర నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న కుటుంబాలకు ఉల్లి ధరల పెరుగుదల అదనపు భారంగా మారింది. మార్కెట్లో ఉల్లి ధరలను నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టి, సరఫరాను పెంచి ధరలు తగ్గేలా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు. ఉల్లి ధర సెంచరీకి చేరకముందే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి సామాన్యులకు ఉపశమనం కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది.