తాతారావు సారే న్యాయం చేయాలి
- విత్తన ఉత్పత్తి సాగులో మోసపోయిన గిరిజన రైతులు అభ్యర్థన.
- ఆదివాసీ రైతులను అడ్డంగా దోచుకున్న ఆర్‌కే
- ఆర్గనైజర్ దొంగాటలో ఆర్థికంగా నష్టపోయిన వరి విత్తనోత్పత్తి సాగు రైతులు
- ఆడ వడ్లకు ఒక్కొక్క కింటాకు రూ.11 వేలంటూ రైతుకు ఆశలు
- పంట పండకపోతే ఎకరాకు రూ.80 వేల పరిహారమంటూ ఆర్‌కే హామీలు
- దిగుబడి రాకపోవడంతో పరిహారం ఎగ్గొడుతున్నారంటూ రైతుల ఆరోపణ
- న్యాయం చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆశ్రయించిన 18 మంది రైతులు
పినపాక, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతుల(Tribal farmers)కు అధిక దిగుబడి, అధిక ధర, పంట నష్టపోతే పరిహారం అంటూ ఆశలు చూపించి వరి సాగు(Paddy cultivation)లోకి దించి.. తీరా పంట చేతికొచ్చిన తర్వాత హామీలను విస్మరిస్తున్నారని రైతులు(Farmers) ఆరోపిస్తున్నారు. ఓ బహుళ జాతి వరి విత్తనోత్పత్తి కంపెనీ(Multinational rice seed production company) ప్రతినిధులుగా పరిచయం చేసుకున్న ఆర్కే, స్థానిక సూపర్వైజర్ చెప్పిన మాటలు నమ్మి పంట సాగు(Crop Cultivation) చేసి తీవ్రంగా నష్టపోయామని బాధిత రైతులు వాపోతున్నారు.
రూ.11 వేల ధర అంటూ నమ్మించారు
పినపాక మండలంలోని కొత్తగుంపు, జానంపేట తదితర ప్రాంతాలకు చెందిన 18 మంది రైతులు 2025 డిసెంబరు నుంచి 2026 మే వరకు రబీ సీజన్లో అడ్వాంట్ (ఐటీసీ) కంపెనీకి సంబంధించిన 509, 506 రకాల ఆడ, మగ వరి పంటలను సాగు చేసినట్లు చెబుతున్నారు. కరకగూడెం మండలానికి చెందిన ఆర్కే కంపెనీ ప్రతినిధిగా, కోడూరి నరసింహారావు స్థానిక సూపర్వైజర్గా తమకు పరిచయమయ్యారని రైతులు పేర్కొన్నారు. వారి మాటల ప్రకారం.. ఎకరాకు 10 నుంచి 18 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని, ఆడ వడ్లను క్వింటాకు రూ.11,000 చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఆడ వడ్ల దిగుబడి నాలుగు క్వింటాళ్లలోపే వస్తే ఎకరాకు సుమారు రూ.80 వేల వరకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.
అగ్రిమెంట్ అడిగితే దాటవేత
నష్టపరిహారానికి సంబంధించి కంపెనీతో రాతపూర్వక ఒప్పందం ఉంటుందా అని రైతులు పలుమార్లు ప్రశ్నించినా.. విషయం సాగదీస్తూ వచ్చారని ఆరోపిస్తున్నారు. స్థానిక సూపర్వైజర్ తమకు బాధ్యత వహిస్తానని, నారు పోసినప్పటి నుంచి పంట కోత వరకు పర్యవేక్షిస్తానని చెప్పడంతో తాము నమ్మి సాగు ప్రారంభించామని బాధితులు తెలిపారు.అగ్రిమెంట్ విషయాన్ని పంట కోత వరకు అడిగినా ప్రతిసారీ ఏదో ఒక కారణంతో వాయిదా వేస్తూ వచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు.
దిగుబడి నాలుగు క్వింటాళ్లలోపే
పంట కోత అనంతరం తాము సాగు చేసిన ఆడ వరి పంటలో ఎకరాకు నాలుగు క్వింటాళ్లలోపే దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు. కొనుగోలు సమయంలో క్వింటాకు 10 కిలోల తరుగు తీసుకున్నారని, దీంతో తమకు మరింత నష్టం వాటిల్లిందని వాపోతున్నారు.సాగు ఖర్చుల నిమిత్తం నాలుగు విడతల్లో కలిపి ఎకరాకు సుమారు రూ.40 వేల వరకు చెల్లించారని, విత్తనాల కోసం రూ.1,200 తీసుకున్నారని రైతులు తెలిపారు.
పరిహారం అడిగితే కాలయాపన..?
తక్కువ దిగుబడి వచ్చిన నేపథ్యంలో ముందుగా ఇచ్చిన హామీ మేరకు నష్టపరిహారం చెల్లించాలని కంపెనీ ప్రతినిధులు, సూపర్వైజర్ను కోరినా.. ప్రస్తుతం రోజుకో మాట చెబుతూ కాలయాపన చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
న్యాయం కావాలని మండల వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదించినా నిరాశే
తమకు జరిగిన అన్యాయంపై వ్యవసాయశాఖ అధికారులను కలిసినా సానుకూల స్పందన లభించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. బాధిత రైతుల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు కూడా కొర్రీలు పెడుతున్నారని వాపోయారు. అధికారుల తీరుపై ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు.
పోలీసులను ఆశ్రయించిన రైతులు
తమకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ అంగోతు రంగయ్య అనే రైతు బయ్యారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమతో పాటు మరో 17 మంది రైతులు నష్టపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
విత్తనాల నాణ్యతపై అనుమానాలు
తక్కువ దిగుబడి రావడంతో తమకు సరఫరా చేసినవి నాణ్యమైన హైబ్రిడ్ విత్తనాలేనా? లేక నకిలీ విత్తనాలా? అనే అనుమానం కలుగుతోందని రైతులు పేర్కొన్నారు. వ్యవసాయశాఖ అధికారులు విత్తనాల నాణ్యతపై శాస్త్రీయంగా పరీక్షలు నిర్వహించి, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
‘తాతారావు’ సారే న్యాయం చేయాలి: బాధిత రైతులు వేడుకోలు
తమ సమస్యను స్థానిక అధికారులు పట్టించుకోకపోయినా డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి తాతారావు సార్ తమకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని బాధిత రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు జరిగిన నష్టంపై సమగ్ర విచారణ జరిపి, హామీ ఇచ్చిన నష్టపరిహారం ఇప్పించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఆర్గనైజర్ తో కాకుండా సంబంధిత విత్తనోత్పత్తి కంపెనీ యాజమాన్యాన్ని వ్యవసాయ శాఖ అధికారి తాతారావు పిలిపించి రైతులతో కూర్చోబెట్టి నష్టపరిహారంపై మాట్లాడితే సమస్యకి ఒక పరిష్కారం వచ్చే అవకాశం ఉంది.
విత్తనాలు అంటగట్టిన ఆర్గనైజర్ కూడా రైతులపై దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనపై కూడా జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించాలి. ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడా కూడా ఆర్గనైజర్ ఆర్కె విత్తనోత్పత్తి సాగులో సన్నాకారు, చిన్న కారు, ఆదివాసి గిరిజన రైతులను మోసం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. వరి విత్తనోత్పత్తి సాగుతో ఆర్థికంగా నష్టపోయిన తమకు ‘తాతారావు సారే‘ న్యాయం చేయాలని చేతులెత్తి మొక్కుతున్నారు.