బ్రిక్స్‌కు జిన్‌పింగ్

11-09-2026 | 05:40am
  1. 12న ఢిల్లీకి చైనా అధ్యక్షుడు రాక

ఏడేళ్ల తరువాత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం

ప్రతిష్ఠంభనలను తొలగించి ముందుకు వెళ్లేందుకే ప్రాధాన్యం

బ్రిక్స్‌కు 20 ఏళ్లు పూర్తి, భారత్ నాలుగోసారి అధ్యక్షత

సదస్సుకు మూడంచెల భద్రత

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: దేశరాజధాని ఢిల్లీలో జరుగనున్న పద్దెనిమిదో బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Chinese President Xi Jinping) వస్తున్నారని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. 12న లేదా 13వ తేదీన జిన్‌పింగ్ ఢిల్లీకి చేరుకుంటారని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య అదే రోజు సాయంత్రం 6 గంటలకు ద్వైపాక్షిక సమావేశం జరగనుం ది.

ఇరువురి మధ్య సరిహద్దు, సైనిక ఉద్రిక్తతలు, వాణిజ్యలోటు పూడ్చుకోవడం, ఆర్థిక బంధాల పటిష్టం వంటి అంశాలపై సుధీర్ఘ చర్చలు చేపట్టనున్నారు. ఇటీవల జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చైనాలో పర్యటించి ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. ఇందులో లైన్ ఆఫ్ కంట్రోల్ ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరుదేశాల మధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేసిన వర్కింగ్ మెకానిజం (డబ్ల్యూఎంసీసీ) కమి టీ కూడా సమావేశమైంది.

లైన్ ఆఫ్ కంట్రోల్ సమస్య భారత్ మధ్య ప్రతిష్ఠంభనలకు దారితీస్తుంది. దీంతో రాజకీయ, ఆర్థిక, దౌత్య సంబంధాల క్షీణతకు కారణమవుతుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఎంసీసీ కమిటీ చేసిన ప్రతిపాదనలతో ఇరుదేశాలు ఆయా సమస్యల పరి ష్కార దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది.

కాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రదేశాలను చైనా తమవిగా చెప్పుకుంటూ వస్తుండగా భారత్ ఈ చర్యలను పదే పదే తోసిపుచ్చుతూ, ఖండిస్తూ వస్తోంది. ఈ అంశంపై కూడా మోదీత నేతృత్వంలోని అత్యున్నతస్థాయి బృందం చర్చల్లో పాల్గొననుంది. 

మరోవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతల అనంతరం ఆసియా దేశాలపై అమెరికా జోక్యంతో నెలకొంటున్న అస్థిరతలపై కూడా చర్చిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇరుదేశాల మధ్య అత్యంత ముఖ్యమైన ఎల్‌వోసీ సమస్య పరిష్కార దిశగా అడుగులు పడితే ఇక ఆసియాలో భారత్‌కు తిరుగుండదని పలువురు భావిస్తున్నారు. భారత్ బ్రిక్స్ సదస్సుకు నాలుగోసారి అధ్యక్షత వహిస్తుంది. బ్రిక్స్ ఏర్పడి 20 ఏళ్లు పూర్తవుతున్నాయి.

కాగా బ్రిక్స్ సమావేశానికి బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్‌కు ఆహ్వానం అందలే దని, బిమ్స్‌టెక్ చైర్‌పర్సన్‌గా శిఖరాగ్ర అవుట్‌రీచ్ సమావేశానికి రావాల్సిందిగా మాత్రమే ఆహ్వానం అందిందని అందుకే ప్రధాని హాజరవడం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో భారత మండపంలో నిర్వహించనున్న బ్రిక్స్ 2026 సదస్సు కోసం మూడంచెల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

15వేల మంది పోలీసులు, 200 కంపెనీల నుంచి పారామిలటరీ దళాలు, ఎన్‌ఎస్‌జీ, ఇంటలిజెన్స్ బ్యూరో భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అగర్వాల్ తెలిపారు. కీలక ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచేందుకు హై-రిజల్యూషన్, ప్రత్యేక నిఘా కెమెరాలతో సహా 500కు పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. వీవీఐపీల రాక నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని చెప్పారు.

ఏడేళ్ల తర్వతా తొలి ద్వైపాక్షిక భేటీ

చివరిసారిగా 2019లో చెన్నై సమీపంలో ని మామల్లపురంలో మోదీతో అనధికారిక సదస్సు కోసం షీ భారత్‌ను సందర్శించారు. అంతకు ముందు 2016లో బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు ఆయన గోవాను సందర్శించారు. అలాగే సెప్టెంబర్ 2014లో తన తొలి భారత పర్యటన సందర్భంగా మోదీతో విస్తృత చర్చలు జరిపారు. ఆ 2014 పర్యట న ఇద్దరు నాయకుల పదవీకాలంలో మొదటి దశలో జరిగింది.

2020 తూర్పు లడఖ్ సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత సంబంధాలు స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో, వాటిని సాధారణ స్థితికి తెచ్చేందుకు భారత్, చైనా ప్రయత్నిస్తున్న తరుణంలో షీ రాబోయే పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అనేక దేశాల్లో జరిగిన సదస్సుల్లో ఇరుదేశాధినేతలు పాల్గొన్నా.. కేవలం కరచాలనం వరకే పరిమితమయ్యారు. ఎటువంటి ద్వైపాక్షిక సమావేశమూ నిర్వహించలేదు.

మరిన్ని వార్తలు