ఇటలీ భాషలో ఫీజుల బాధ!
- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు విద్యార్థుల ఆవేదన
- రాష్ట్రంలో 15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు
- ఇటాలియన్‌లో లేఖరాసిన బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ(Telangana)లో ఫీజు రీయింబర్స్ మెంట్(Fee Reimbursement) డబ్బుల కోసం విద్యార్థులు(Students) ఆందోళన చేస్తున్నారు. ప్రతిపక్షాలు సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల(Fee reimbursement funds) విడుదలలో ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూనే ఉన్నాయి. విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలంటూ మొన్నటికి మొన్న బీజేపీ అసెంబ్లీ(BJP Assembly) ముట్టడి చేపట్టింది. తాజాగా, విద్యార్థుల ఆవేదనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు(N Ramchander Rao) వినూత్న పద్ధతిలో కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలియజేసే ప్రయత్నం చేశారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi)కి ఇటలీ భాషలో లేఖ రాశారు. తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టిని ఆకర్షించేందుకు వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్రంలో సాగుతున్న ఆందోళనలు, విద్యార్థుల నిరసనలు, పోలీసుల లాఠీఛార్జులు, అరెస్టులు వంటివేవీ రాహుల్‌గాంధీని గానీ, తెలంగాణ ప్రభుత్వాన్ని గానీ కదిలించలేకపోయాయని, అందుకే ఆయన ‘మాతృభాష‘ అయిన ఇటాలియన్‌లో లేఖ రాస్తున్నట్లు ఆయన ఎద్దేవా చేశారు.
రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో 40 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆందోళన చెందారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో విద్యాసంస్థల యాజమాన్యాలు నిధుల కొరత ఎదుర్కొంటున్నాయన్నారు. అధ్యాపకులు, సిబ్బంది కూడా అరకొర వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని రాంచందర్‌రావు పేర్కొన్నారు. ఈ అంశంపై విద్యార్థులకు మద్దతుగా బీజేపీ నిలిస్తే రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులు, పోలీసు చర్యలతో అణచివేస్తోందని విమర్శించారు.
సమస్య పరిష్కారం కోసం గళమెత్తినందుకు గత పది రోజుల్లోనే తనను నాలుగుసార్లు అరెస్టు చేశారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూత్ డిక్లరేషన్‌లో పేర్కొన్న నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, విద్యా భరోసాకార్డుల వంటి హామీలను నెరవేర్చలేదని అన్నారు. రాహుల్‌గాంధీ తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఒత్తిడి తేవాలని, విద్యావ్యవస్థను గాడిలో పెట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.