5,500 మందికి ‘ఉడాన్’ శిక్షణ

20-09-2026 | 05:05am
  1. టాస్క్, డెల్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో నిర్వహణ
  2. మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఒప్పందం

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలోని యువతకు సాంకేతికత రంగం(Technology sector)లో శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(Telangana Academy for Skill and Knowledge) (టాస్క్), డెల్ టెక్నాలజీస్ కలిసి ‘ఉడాన్’ కార్యక్రమాన్నిచేపట్టనున్నాయి. ఈ మేరకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు(Sridhar Babu) సమక్షంలో శనివారం సచివాలయంలో టాస్క్, డెల్ టెక్నాలజీస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఉడాన్ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 25 శిక్షణ కేంద్రాల్లో 5,500 మందికి మూడు నెలల పాటు శిక్షణ అందించనున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence)(ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్(Cloud Computing), ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, డిజిటల్ స్కిల్స్‌తో పాటు పరిశ్రమల పరిజ్ఞానం, ఉద్యోగ సాధనకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఐఐటీ ఢిల్లీ రూపొందించిన కరిక్యులమ్‌ను వాడుతారు. డెల్ టెక్నాలజీస్ సాంకేతిక సహకారం అందిస్తుంది.

కాగా, కార్యక్రమంలో ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర కౌన్సిల్ కార్యదర్శి రామ్, టాస్క్ సీఈవో నితిన్ కుమార్‌రెడ్డి, సీవోవో సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సీవోవో నిఖిల్, డెల్ టెక్నాలజీస్ సీనియర్ అకౌంట్ మేనేజర్ కృష్ణ కిషోర్, ఏపీజేసీ రీజినల్ సీఐవో, హైదరాబాద్ సైట్ డైరెక్టర్ రమేష్ జంపుల పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు