మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేతనాలు, బిల్లులు వెంటనే చెల్లించాలి
- మధ్యాహ్న భోజన కార్మికులపై వేధింపులు ఆపాలి
కోటపల్లి,(విజయక్రాంతి): మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓకు సోమ వారం వినతిపత్రం అందజేశారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న కార్మికులను రాజకీయ ఒత్తిళ్లకు గురిచేయడం, అక్రమంగా తొలగించడం వెంటనే నిలిపివేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు కావేరి రవి మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులు 25 ఏళ్లుగా పాఠశాలల్లో సేవలందిస్తున్నప్పటికీ వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.10 వేల వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు, బిల్లులను వెంటనే చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రాజకీయ జోక్యంతో కార్మికులను వేధించడం, అక్రమ తొలగింపులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు
