బైక్ దొంగల ముఠా గుట్టురట్టు
9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.. ముగ్గురు నిందితుల అరెస్ట్
గరిడేపల్లి, అక్టోబర్ 3:(విజయక్రాంతి) : గరిడేపల్లి పోలీసులు(Garidepalli Police) బైక్ దొంగల ముఠా(Bike stealing gang) గుట్టును రట్టు చేశారు. కీతవారిగూడెంలో చోరీకి గురైన బైక్‌ను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.3 లక్షల విలువైన వివిధ రకాల 9 ద్విచక్ర వాహనాలను(Two-wheelers) స్వాధీనం చేసుకున్నట్లు హుజూర్నగర్ సిఐ చరమందరాజు(Huzurnagar CI Charamanda Raju) తెలిపారు. శనివారం నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.ఈ నెల 29న కీతవారిగూడెంలో ఓ వ్యక్తి ఇంటి ముందు నిలిపిన హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ చోరీకి గురైంది.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.శనివారం ఉదయం గరిడేపల్లి కల్మల్‌చెరువు రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా బైక్‌పై వెళ్తుండటాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.విచారణలో వారి నుంచి బైక్ చోరీల వివరాలు వెలుగులోకి వచ్చాయి. గరిడేపల్లి, సూర్యాపేట, మిర్యాలగూడ, దామరచర్ల, రామన్నపేట, నార్కట్‌పల్లి తదితర ప్రాంతాల్లో పలు బైక్‌లను చోరీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
చోరీ చేసిన వాహనాల్లో కొన్నింటిని బైక్ మెకానిక్ ద్వారా విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకొని మొత్తం 9 బైక్‌లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. వారి వెంట రైటర్ నాగేశ్వరరావు, ఏఎస్ఐ గౌరీశంకర్ , నగేష్, ప్రశాంత్, సురేష్, పలువురు సిబ్బంది ఉన్నారు