బీర్కూర్‌లో రెండు ఇళ్లలో చోరీ కేసును చేధించిన పోలీసులు
సాంకేతిక ఆధారాలతో ఏడాది తర్వాత కేసును ఛేధన
రూరల్ సీఐ తిరుపతయ్య వెల్లడి
బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడాది క్రితం జరిగిన రెండు ఇళ్లలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఫింగర్‌ప్రింట్ టెక్నాలజీ, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి కర్ణాటకకు చెందిన సకత్ గోపిని నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు.రూరల్ సిఐ తిరుపతయ్య తెలిపిన వివరాల ప్రకారం.. 1 ఆగస్టు 2025 సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో బీర్కూర్‌లోని ఓ ఇంటి తాళం పగలగొట్టి, బీరువా తాళాలను ధ్వంసం చేసి బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించారు.
అదే రాత్రి ఎదురుగా ఉన్న మరో ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న రూ.2 వేల నగదును అపహరించారు. రెండు ఇళ్లలో చోరీకి గురైన వస్తువుల విలువ సుమారు రూ.22 వేలుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాన్సువాడ డీఎస్పీ, బాన్సువాడ రూరల్ సీఐ పర్యవేక్షణలో బీర్కూర్ ఎస్సై ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఫింగర్‌ప్రింట్ టెక్నాలజీతో పాటు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన సకత్ గోపిని నిందితుడిగా గుర్తించారు. ఆగస్టు 19న మహారాష్ట్ర నుంచి బోధన్ వైపు వెళ్తున్న సమయంలో బరంగేడిగి గ్రామం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పెట్రోలింగ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఏడాది క్రితం బీర్కూర్ పరిధిలో చోరీకి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడి వద్ద నుంచి చోరీలకు ఉపయోగించిన ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకుని, అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సకత్ గోపిపై గతంలో కూడా చోరీ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. 2022లో బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసులో నిందితుడు రిమాండ్‌కు వెళ్లినట్లు వెల్లడించారు.కేసులో మిగిలిన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, ఫింగర్‌ప్రింట్, సీసీ కెమెరాల సహాయంతో నేరాలను ఛేదించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.






