యువతులు వారు ఎంచుకున్న రంగాల్లో రాణించాలి..
'మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026' విజేత ప్రీతి ముండే ఘన సన్మానంలో వక్తల పిలుపు....
ఆదిలాబాద్, అక్టోబర్ 02, (విజయక్రాంతి): అడవుల జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన ప్రీతి ముండే(Preethi Munde) జాతీయ స్థాయిలో 'మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026' కిరీటాన్ని కైవసం చేసుకుకోవడం జిల్లాకే గర్వకారణమని పలువురు వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్(MP Godam Nagesh), జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషా పాల్గొన్నారు. ముందుగా వందేమాతర గీతాలాపన చేశారు.
అనంతరం 'మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026' ప్రీతి ముండేతో పాటు ఆమె తల్లిదండ్రులు ఉమ-ప్రకాశ్ లను అతిథులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జిల్లా యువతులు ప్రీతిని రోల్ మోడల్‌గా తీసుకుని వారు ఎంచుకున్న రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. అందంతో పాటు ఆరోగ్యం సైతం చాలా ముఖ్యమని, తమ ప్రస్తుత స్థితి గురించి ఆలోచించకుండా లక్ష్యం వైపు ముందుకు సాగితే విజయం ఖచ్చితంగా సాధ్యమవుతుందని సూచించారు.
ఇంద్రవెల్లి మండలం హిరాపూర్ గ్రామానికి చెందిన ప్రీతి ముండే జాతీయ స్థాయి వేదికపై జిల్లా పేరును నిలబెట్టారని కొనియాడారు. చదువుతో పాటు సంస్కృతి, పురాణాలు, ఇతిహాసాలపై ఆమెకు ఉన్న విస్తృత అవగాహనే విజయాలకు బాటలు వేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, హీరాపూర్ గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.