రిజర్వేషన్ హటావోకు 10 ప్రశ్నలు

08-09-2026 | 05:35am

ఢిల్లీలో ఇటీవల జరిగిన రిజర్వేషన్ హటావో ఉద్యమం(Reservation Hatao Andolan)- చరిత్ర, నిజ స్వరూపాన్ని అందరూ తెలుసుకోవాలి. అసలు ఉద్యమం ఎవరిది? అన్నది ప్రధాన చర్చ. రిజర్వేషన్ హటావో ఆందోళన ప్రధానంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎదిగిన ఉద్యమం. 2026 జూలై నాటికే ఆ ఉద్యమ ఇన్‌స్టాగ్రామ్ పేజీకి సుమారు 56 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ‘ఎక్స్’లోనూ వేలాది ఫాలోవర్లు ఉన్నారు. ఇది సంప్రదాయ రాజకీయ పార్టీగా కాకుండా తనను తాను ప్రజాఉద్యమంగా చూపించుకుంటున్నది.

కానీ ఆగస్టు 21 ఢిల్లీ కార్యక్రమంలో అజిత్ భారతి వంటి రైట్ వింగ్ వ్యాఖ్యాత ప్రముఖంగా మాట్లాడారు. ఇటీవల కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉద్యమ ప్రతినిధులను కలిశారు. ఈ సమావేశాన్ని సహృద్భావ చర్చలుగా ఆయన అభివర్ణించారు. చర్చలు కొనసాగుతాయని కూడా చెప్పారు. ఇది రాజకీయంగా ముఖ్యమైన పరిణామం. ఇది అణగారిన వర్గాలు ఎదగకూడదని ఆధిపత్య కుల వర్గాలు పథకం ప్రకారం చేస్తున్న ఒక తప్పుడు కార్యక్రమమని చెప్పక తప్పదు.

రిజర్వేషన్ హటావో ఉద్యమం చేస్తున్నవారి ప్రధాన డిమాండ్లు ఇలా ఉన్నాయి. 1.కుల ఆధారిత రిజర్వేషన్లకు బదులుగా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు 2. రిజర్వేషన్ వ్యవస్థపై శ్వేత పత్రం 3. రిజర్వేషన్ పొందే వారికి కనీస అర్హత /కనీస మార్కులు 4. ఈడబ్ల్యూఎస్‌కు మరింత ప్రయోజనాలు 5. క్రీమిలేయర్ భావనను విస్తరించడం 6. ఎస్సీ/ ఎస్టీ రిజర్వేషన్ విధానాన్ని కూడా పునఃసమీక్షించడం 7. యూజీసీ క్యాస్ట్ ఈక్విటీ రెగ్యులేషన్‌కు వ్యతిరేకత 8. ఎస్సీ/ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్‌లో మార్పులు చేయాలని డిమాండ్ చేయడం. అయితే, ఈ వాదనలపై కొన్ని సూటి ప్రశ్నలను లేవనెత్తుతూనే, వాటికి సమాధానాలను పొందుపరుస్తున్నాను.

1.రిజర్వేషన్లు ఎందుకు?: ఈ ప్రశ్నకు సమాధానం ఇది. రిజర్వేషన్ అణగారిన వర్గాలకు దయగా ఇచ్చిన బిక్ష కాదు. రాజ్యాం గం కల్పించిన ప్రాథమిక హక్కు. శతాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా, విద్య, రాజకీయపరంగా అణచివేయడం వలన ఏర్పడిన అసమానతలను సరిచేయడానికి, సమానత్వ సాధనకు రాజ్యాంగం కల్పించింన ప్రత్యేక రక్షణలు (ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4) తదితరాలు. అందుకే రిజర్వేషన్‌ను పేదరిక నిర్మూలన పథకంగా చూడటం తప్పు.

రిజర్వేషన్ ప్రధాన లక్ష్యం  సామాజిక న్యాయం, సముచిత ప్రాతినిధ్యం, అందరికీ సమాన అవకాశాలు, చారిత్రాత్మక అన్యాయాలను సరిదిద్దడం. దీనిని అఫర్మేటివ్ యాక్షన్, పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని కూడా అంటారు. ప్రపంచంలోని చాలా దేశాలు ఇలాంటి రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. ఉదాహరణకు అమెరికా కూడా. కానీ అక్కడికి, ఇక్కడికి తేడా ఏమిటంటే భారతదేశంలో మెజారిటీ ప్రజలు మైనారిటీ ప్రజలను రిజర్వేషన్లు అడుగుతున్నారు. అక్కడ మెజారిటీ ప్రజలు మైనారిటీ ప్రజలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు.

2.రిజర్వేషన్ వల్ల మెరిట్ దెబ్బతింటుం దని అంటున్నారు. అసలు మెరిట్ అంటే ఏమిటి?: మెరిట్‌ను కేవలం పరీక్షలో వచ్చిన మార్కులతో కొలవలేం. ఒక విద్యార్థికి చిన్నప్పటి నుంచే మంచి పాఠశాల, ప్రైవేట్ ట్యూషన్, కోచింగ్, పుస్తకాలు, కంప్యూటర్, చదువుకున్న తల్లిదండ్రులు ఉంటే అతని మార్కుల వెనుక ఆ అవకాశాల పాత్ర ఉం టుంది. మరో విద్యార్థి పేద కుటుంబం నుంచి, మొదటి తరం విద్యార్థిగా, పరిమిత వనరులతో చదివి పరీక్ష రాస్తే అతని సామాజిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం మార్కులతో మెరిట్‌ను నిర్వచించ డం ఫార్మల్ ఈక్వాలిటీ మాత్రమే.

రాజ్యాంగ లక్ష్యం వాస్తవ సమానత్వం. భారతీయ విద్యా విధానంలో మెరిట్ అంటే బట్టి పట్టి రాయ డం. ఇది బ్రాహ్మణులు,అగ్ర కులాలకు అనుకూలమైన విధానం. భారతీయ విద్యావ్యవస్థలో దశాబ్దాలుగా మార్కుల ఆధారిత మూల్యాంకనం రాజ్యమేలుతోంది. గుర్తుపెట్టుకొని, పరీక్షల్లో ఎంతవరకు తిరిగి రాయగలరనే దాని ఆధారంగానే ఒక విద్యార్థి సామర్థ్యాన్ని కొలవడం వల్ల ‘రోట్ లెర్నింగ్’ లేదా బట్టి పట్టే సంస్కృతి పెరిగిందనేది విద్యావేత్తల ప్రధాన ఆరోపణ.

నైపుణ్యాల లేమి: ఈ విధానం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, ఆచరణాత్మక నైపుణ్యాలు దెబ్బతింటున్నాయని విమర్శలు ఉన్నాయి. సామాజిక నేపథ్యాల ప్రభావం: వివిధ వృత్తి కులాలు లేదా గ్రామీణ, శ్రమజీవుల నేపథ్యాల నుంచి వచ్చే విద్యార్థులు అనుభవపూర్వకమైన, ఆచరణాత్మకమైన నైపుణ్యాలు కలిగి ఉంటారు. కేవలం అక్షరబద్ధమైన, బట్టి పట్టే పరీక్షల వల్ల వారిలోని సృజనాత్మకత గుర్తించడం లేదనే వాదన ఉంది.

నూతన మార్పులు, సంస్కరణలు: ఈ లోపాలను సరిదిద్దడానికి, విద్యను కేవలం మెమొరైజేషన్‌కే పరిమితం చేయకుండా ఉండటానికి ఇటీవలి కాలంలో పలు మార్పులను సూచిస్తున్నారు.వాటిలో జాతీయ విద్యా విధానం 2020 (ఎన్‌ఈపీ 2020) ఒకటి. ఎన్‌ఈపీ 2020 ప్రధానంగా బట్టి చదువుల సంస్కృతిని తగ్గించి, అనుభవపూర్వక అభ్యాసం, ప్రాజెక్ట్ ఆధారిత విద్య, క్రిటికల్ థింకింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశిస్తోంది.

సమగ్ర మూల్యాంకనం: కేవలం ఒకే రాత పరీక్ష ఆధారంగా కాకుండా, విద్యార్థి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాక్టికల్ విజ్ఞానం, క్రిటికల్ ఆలోచనా ధోరణి ఆధారంగా మెరిట్‌ను అం చనా వేయాలనే డిమాండ్ విస్తృతంగా ఆమో దం పొందుతోంది. విద్యార్థిలోని వాస్తవ సామర్థ్యాన్ని, సృజనాత్మకతను వెలికితీసేలా పరీక్షా విధానాలు మారినప్పుడే సమాజంలోని అన్ని వర్గాల విద్యార్థులకు సమాన అవకాశాలు, సరైన న్యాయం లభిస్తాయి. 

3. వేల సంవత్సరాల అసమానత కొన్ని దశాబ్దాల్లోనే తొలగిపోయిందా?: ఇదే అత్యంత ముఖ్యమైన ప్రశ్న. భారతీయ సమాజంలో విద్య, జ్ఞానం, వృత్తులు, అధికారంలో కుల ఆధారిత ప్రత్యేక హక్కులు, నిరాకరణ లు వేల సంవత్సరాలుగా కొనసాగాయి. ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ అమలు (1993) ప్రారంభమై మూడు దశాబ్దాలు మాత్రమే అయ్యింది. అలాగే కేంద్ర విద్యాసంస్థలలో 2008 నుంచి మాత్రమే అమలవుతున్నాయి.

మూడు దశాబ్దాల సానుకూల చర్యతో శతాబ్దాల సామాజిక అసమానత పూర్తిగా మాయమైందని ఎలా చెప్పగలం?ఇది భావోద్వేగ ప్రశ్న కాదు, డేటాతో సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. నిజానికి గత 80 ఏళ్ల స్వాతంత్య్ర పాలనలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయి.

ఏ రంగంలో చూసినా ఆధిపత్య కులాల ప్రాతినిధ్యమే. ఒకవైపు కులవృత్తులు నశించి బీసీలు శ్రామికులుగా, గిగ్ వర్కర్లుగా మారిపోతే, ఆధిప త్య కులాల వాళ్లు ప్రకృతి సంపదను, ప్రభుత్వాలను శాసిస్తూ కోట్లకు కోట్లు సంపాదించుకొని బిలియనీర్లుగా మారారు. మరి తీవ్ర ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు ఉన్న ఈ దేశంలో ఈ పాటి రిజర్వేషన్లు కూడా లేకపోతే వారి ప్రాతినిధ్యం ఏ మాత్రం లేకుండా పోతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

4.బీసీ/ఓబీసీలకు రిజర్వేషన్ ఉన్నప్పటికీ వారి ప్రాతినిధ్యం జనాభాకు అనుగుణం గా ఉందా?: ఇదే అసలు పరిశీలించాల్సిన విషయం. కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్ ఏ, గ్రూప్ బీ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఓబీసీ ప్రాతినిధ్యం ఎంత ఉంది? నిర్ణయాధికార స్థానాల్లో ఎంత? విశ్వవిద్యాలయ అధ్యాపకుల్లో ఎంత? ఉన్నత న్యాయవ్యవస్థలో ఎంత? ప్రభుత్వ సంస్థల బోర్డుల్లో ఎంత? రిజర్వేషన్ ఉన్నప్పటికీ ప్రాతినిధ్యం ఎంత వచ్చింది? అనేదే అసలు ప్రశ్న. రిజర్వేషన్ ఫలితాలపై ప్రభుత్వమే పూర్తి స్థాయి శ్వేత పత్రం విడుదల చేయాలి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో గత 33 సంవత్సరాలుగా ఓబీసీలకు రిజర్వేషన్లు అమలవుతున్నా, నేటికీ కూడా ఏ కేటగిరీ, బీ కేటగిరీ ఉద్యోగాలలో 22 శాతం దాటలేదు. మరి ఎందుకు దాటలేదు? అనే దానికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే చట్టసభలలో ఓబీసీ ప్రాతినిధ్యం నామమాత్రమే. న్యాయవ్యవస్థను తీసుకుంటే, అం దులో ఓబీసీలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం కూడా నామమాత్రం.

మరి ఈరోజు దేశంలో ఓబీసీ వర్గాలు తమకు జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు కావాలని, కోర్టులు విధించినటువంటి 50 శాతం సీలింగ్‌ను రాజ్యాంగ సవరణ చేసి ఎత్తివేయాలని కోరుతున్నప్పటికీ, పాలకులు పట్టించుకోవడం లేదు. కానీ, 10 శాతం లేని ఆధిపత్యకుల పేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఇది ఏ సామాజిక న్యాయానికి నిదర్శనమో పాలకులు సమాధానం చెప్పాల్సిందిగా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

5. ఆర్థికంగా పేదవారందరికీ సహాయం చేయకూడదా?: తప్పకుండా చేయాలి. పేదరిక నిర్మూలనకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత కోచింగ్, హాస్టళ్లు, ఆరోగ్యం, ఉపాధి వంటి కార్యక్రమాలు మరింత బలంగా ఉండాలి. కానీ, ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. పేదరికం, సామాజిక వెనుకబాటుతనం సమానం కాదు. ఆర్థికంగా పేదవాడికి ఆర్థిక సమస్య ఉంటుంది.

సామాజికంగా వెనుకబడిన వర్గానికి చారిత్రకంగా ఏర్పడిన ప్రాతినిధ్య లోపం, సామాజిక వివక్ష, అవకాశాల కొరత వంటి సమస్యలు కూడా ఉంటాయి. అందుకే రెండింటి నీ ఒకటిగా చూడలేం. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన కార్యక్రమం కాదనే విషయాన్ని అందరూ గ్రహించాలి. 1991లో పీవీ నరసింహారావు అగ్రకుల పేదలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొస్తే, ఇంద్రా సాహ్నీ కేసులో 9 మంది జడ్జీల్లో 8 మంది జడ్జీలు ఇది రాజ్యాంగ వ్యతిరేకమని కొట్టివేశారు. అయినప్పటికీ పాలకులు తమ వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చుకున్నారు.

కానీ బీసీలకు సంబంధించి 50% సీలింగ్ ఎత్తివేయాలనే, దానికి రాజ్యాంగ సవరణ చేయాలనే డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు. అధికంగా ఎదిగిన ఓబీసీలు రిజర్వేషన్లు పొందకుండా క్రీమీలేయర్ ఇప్పటికే అమలులో ఉంది. కాబట్టి ఓబీసీలలో నిరుపేద వర్గాలకే రిజర్వేషన్లు పోవాలని కోర్టులు తీర్పులు ఇచ్చాయి. అలాగే ఓబీసీలలో అత్యం త వెనుకబడ్డ వర్గాలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంది. రోహిణి కమిషన్ రిపోర్టును కూడా అమలుపరచాల ని చెప్పి అత్యంత వెనుకబడ్డ వర్గాలు కోరుతున్నాయి.

6.ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే ఇక కుల రిజర్వేషన్ ఎందుకు?: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆర్థిక వెనుకబాటుతనాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రత్యేక రాజ్యాంగ వ్యవస్థ. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్స్ 15(6), 16(6) చేర్చి ఈడబ్ల్యూఎస్‌కు గరిష్ఠంగా 10% రిజర్వేషన్‌కు రాజ్యాంగ ఆధారం ఏర్పడింది. జన్‌హిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు 2022లో 3:2 మెజారిటీతో 103వ సవరణ చెల్లుబాటును సమర్థించింది. కానీ ఈడబ్ల్యూఎస్ రావడం వల్ల సామాజిక వెనుకబాటుతనం అనే సమస్య అంతరించిపోదు. రెండు వేర్వేరు సమస్యలకు రెండు వేర్వేరు విధానాలు అవసరం. 

7.రిజర్వేషన్ శాశ్వతంగా కొనసాగాలా?: ఏ సామాజిక విధానాన్నీ శాశ్వతంగా ప్రశ్నించకుండా కొనసాగించాల్సిన అవసరం లేదు. కానీ తొలగించడానికి ముందు శాస్త్రీయంగా పరిశీలించాలి. విద్యలో ప్రాతినిధ్యం ఎంత? ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంత? గ్రూప్ ఏ/బీ/సీ/డీ లలో పరిస్థితి ఏమిటి? ఉన్నత విద్యలో ప్రవేశం ఎంత? డ్రాపౌట్ ఎంత? కుటుంబానికి మొదటి తరం గ్రాడ్యుయేట్లు ఎంత? సామాజిక వివక్ష ఎంత? వివిధ బీసీ ఉపకులాల మధ్య ప్రయోజనాల పంపిణీ ఎలా ఉంది? ఈ అంశాలను డేటా ఆధారంగా సమీక్షిద్దాం. సమానత్వం సాధిస్తే రిజర్వేషన్ ను పునఃసమీక్షించడం సహజమే.

కానీ సమానత్వం రాకముందే రిజర్వేషన్ తొలగించడం పరిష్కారం కాదు. భారత రాజ్యాంగం విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్‌కు కాలపరిమితి విధించలేదు. వివక్షత కొనసాగుతున్నంత కాలం రిజర్వేషన్ల అమలునే రాజ్యాంగం కోరుకుంటుంది. ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు మాత్రమే పది సంవత్సరాల కాలపరిమితి ఉంది. అది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి రాజ్యాంగ సవరణ చేసి మనం పొడిగిస్తూ ఉన్నాం. 

8.రిజర్వేషన్ లేకపోతే అందరికీ సమాన పోటీ ఉంటుందా?: వేల ఏళ్ల వివక్షత సృష్టించిన సామాజిక, ఆర్థిక పరిస్థితులు కొద్దీ సంవత్సరాల రిజర్వేషన్ల వల్ల మారుతాయా? నిజంగానే అందరూ ఒకే స్టార్టింగ్ పాయింట్ నుంచి వస్తున్నారా? అన్నది ఆలోచించాలి. పోటీ ఒకటే కావచ్చు. కానీ పోటీకి వచ్చే పరిస్థితులు ఒకటే కావు. ఒకరికి తరతరాలుగా విద్యా మూలధనం ఉండవచ్చు. మరొకరు మొదటిసారిగా విశ్వవిద్యాలయం గడప దాటుతుండవచ్చు. ఒకరికి కోచింగ్ ఉండవచ్చు. మరొకరు కూలి పని చేస్తూ చదివి ఉండవచ్చు. స్టార్టింగ్ లైన్ అసమానంగా ఉన్నప్పుడు ఫినిష్ లైన్ వద్ద అందరూ సమానమే అనడం వాస్తవ సమానత్వం కాదు.

9.రిజర్వేషన్ వల్ల దేశ అభివృద్ధి ఆగి పోతుందా? రిజర్వేషన్ వల్ల దేశ అభివృద్ధి ఆగిపోతుందని చెప్పడం శుద్ధ తప్పు. ఒకవేళ అదే నిజమైతే 69% రేజర్వేషన్లు ఉన్న తమిళనాడు వెనుకబడిన రాష్ట్రంగా ఉండాలి. కానీ దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉంది. మరి ఎలా సాధ్యమైంది? దేశ అభివృద్ధికి అసలు అవసరమైనవి మంచి పాఠశాలలు, నాణ్యమైన ఉన్నత విద్య, ఉద్యోగా లు, నైపుణ్యాలు, పరిశోధన, పారిశ్రామిక పెట్టుబడులు, సమాన అవకాశాలు. రిజర్వేషన్ మాత్రమే అభివృద్ధికి అడ్డంకి అని చెప్పడం సమస్యను తప్పుదోవ పట్టించడమే. 

10.ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎక్కడ?: భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం 40 లక్షలు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలవి అన్నీ కలిపినా 60 లక్షల ఉద్యోగాలకు మించి లేవు. అంటే ప్రభుత్వ రంగంలో ఒక్క కోటి ఉద్యోగాలు కంటే ఎక్కువగా లేవు. కానీ ప్రైవేట్ రంగంలో అంతకు 20, 30 రెట్ల ఉద్యోగాలు కలవు. ఈ ప్రభుత్వ రంగంలో ఉన్న కోటి ఉద్యోగాల్లో కూడా 50 శాతం ఓపెన్ కాంపిటీషన్ ద్వారానే భర్తీ అవుతాయి. మిగిలినవి కేవలం 50 లక్షల ఉద్యోగాలు.

వేల సంవత్సరాలుగా అణచివేయబడ్డ వర్గాలకు 50% రిజర్వేషన్లు అమలు చేస్తుంటే ఆధిపత్య కులాలకు కడుపుమంటగా మారిం ది. వేల సంవత్సరాలుగా కుల వ్యవస్థను, వర్ణ వ్యవస్థను అడ్డం పెట్టుకుని మీరు రిజర్వేషన్లను అనుభవించినప్పుడు మరి మిగతా వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఎవరు ప్రశ్నించిన వాళ్లు లేరు కదా. ఈరోజు భారత రాజ్యాంగం సమాన అవకాశాలు, సామాజిక న్యాయం అనే భావనతో అణచివేయబడ్డ వర్గాలకు కొంత వెసులుబాటు కల్పిస్తే, ఆ వెసులుబాటు మీకు కడుపుమంటగా మారిందా? భారతదేశంలో అత్యంత ప్రధానమైన సమస్య రిజర్వేషన్ సమస్యనేనా? ఇది ఈ రిజర్వేషన్ హటావో ఆందోళనకారులు గమనించాల్సిందిగా కోరుతున్నాను.

మొదలు భారతదేశ చరిత్ర చదవండి. కుల, వర్ణ వ్యవస్థ పుణ్యమా అని ఈ వర్గాలు ఏ విధంగా దోపిడీకి, అణచివేతకు గురయ్యాయో, తెలుసుకొని, రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకొని, సమ్మిళిత అభివృద్ధి, సామజిక న్యాయంపై అవగాహన పెంచుకోవాలి. అంతేకాని అవగాహన లేకుండా ఉద్యమించకండి. భారతదేశం సామాజిక న్యాయం, సమాన త్వం పునాదులపై అభివృద్ధి చెందాలంటే సామాజిక వివక్ష రూపుమాపేంత వరకు ఈ రాజ్యాంగ రక్షణలు కొనసాగాల్సిందే. చివరి మాట రిజర్వేషన్లపై విమర్శలు చేయడం తప్పు కాదు. కానీ విమర్శకు చరిత్ర ఉండాలి. వాదనకు డేటా ఉండాలి.

మెరిట్‌కు సరైన నిర్వచనం ఉండాలి. సమానత్వానికి సామాజిక వాస్తవికత ఉండాలి. రిజర్వేషన్‌ను తొలగించాలంటే ముందుగా కుల వివక్షను తొలగించండి. రిజర్వేషన్‌ను తొలగించాలంటే ముందుగా సమాన ప్రాతినిధ్యాన్ని సాధించండి. రిజర్వేషన్‌ను తొలగించాలంటే ముందుగా సామాజిక అసమానతను తొలగించండి. అప్పుడు రిజర్వేషన్ అవసరం లేని సమాజాన్ని మనమందరం కలిసి నిర్మించవచ్చు. రిజర్వేషన్ హటావో కాదు, అసమానత హటావో! ఇది మన నినాదం కావాలి.

వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్,

బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ చైర్మన్

టీ చిరంజీవులు

మరిన్ని వార్తలు