సమయపాలన పాటించని ప్రభుత్వ ఆసుపత్రి సీహెచ్ఓ..!
ఫీల్డ్ విజిట్ సాకుతో గదికి తాళం... పట్టించుకోని అధికారులు
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి(Banswada Government Area Hospital)లో విధుల నిర్వహణ(performance of duties), సమయపాలనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆసుపత్రిలో పనిచేస్తున్న సీహెచ్ఓ నిర్ణీత సమయాల్లో అందుబాటులో ఉండటం లేదని, ఫీల్డ్ విజిట్ పేరుతో కార్యాలయ గదికి తాళం వేసి ఉండటం కనిపిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రజలకు, ఆసుపత్రి సిబ్బందికి అవసరమైన సమయంలో సంబంధిత అధికారి అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. విధుల్లో భాగంగా ఫీల్డ్ విజిట్‌కు వెళ్లాల్సి వస్తే అందుకు సంబంధించిన వివరాలు, పర్యవేక్షణ వ్యవస్థ స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించేలా పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధులకు హాజరు, ఫీల్డ్ విజిట్ల వివరాలు, కార్యాలయంలో అందుబాటు వంటి అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించి, వాస్తవ పరిస్థితులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీనివాస్, వైద్యులు ప్రకాష్ రాథోడ్‌ని విజయ క్రాంతి వివరణ కోరగా విధులకు గైరాజరిపై విచారణ చేపడతామని పూర్తి నివేదిక అనంతరం వివరాలు వెల్లడిస్తామని సమాధానం చెప్పారు.