ప్రమాదవశాత్తు తుపాకి పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి
పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులర్పించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
బోధన్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్(Nizamabad Police Headquarters)లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎన్‌ఎస్‌ఓ (నైట్ సెక్యూరిటీ ఆఫీసర్) డ్యూటీ ముగించుకుని వచ్చిన అనంతరం ఉదయం సమయంలో ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ హెచ్. సతీష్ (41) మృతి చెందారు.
సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనను పరిశీలించారు. అనంతరం మృతదేహానికి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
పోస్టుమార్టం అనంతరం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పుష్పగుచ్ఛం సమర్పించి సతీష్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో అదనపు డీసీపీ అడ్మిన్ శుభం ప్రకాష్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, బోధన్ ఏసీపీ శ్రీనివాసులు, ఏఆర్ ఏసీపీ కృష్ణస్వామి, సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ నరేందర్, సీటీసీ ఏసీపీ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్ రెడ్డి, మల్లేశం, సీఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీను, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో సతీష్ స్వస్థలమైన ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలానికి తరలించారు.