రూఫ్‌టాప్ సోలార్‌పై అవగాహన కార్యక్రమాలు
ఎల్బీనగర్: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనలో భాగంగా రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుపై అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. సరూర్‌నగర్ ఆపరేషన్స్ డీఈఈ ఫర్హాత్ అలీ వివరాలు వెల్లడిస్తూ.. సరూర్‌నగర్ సర్కిల్ కార్యాలయం, ఆటోనగర్‌లోని వినియోగదారుల సేవా కేంద్రం, డీఈ కార్యాలయంలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం ద్వారా అందించే ప్రయోజనాలు, రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే విధానం, ప్రభుత్వం అందించే సబ్సిడీ, బ్యాంకుల ద్వారా లభించే ఆర్థిక సహాయం, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు తదితర అంశాలపై వినియోగదారులకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. విద్యుత్ వినియోగదారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని రూఫ్‌టాప్ సోలార్‌పై పూర్తి వివరాలు తెలుసుకోవాలని, కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా లభించే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని ఫర్హాత్ అలీ కోరారు.