సైనికుల కుటుంబానికి న్యాయం కోసం ఆర్టీఐ పరిరక్షణ కమిటీ అండ
ఇంటి నంబర్ మార్పుపై రికార్డుల వెలికితీతకు మూడు జిల్లాల కమిటీల చర్యలు..
మా కుటుంబానికి న్యాయం చేయండి సైనికుడి విజ్ఞప్తి..
న్యాయం దిశగా ఆర్టిఐ పరిరక్షణ కమిటీ ఖమ్మం, వరంగల్, జనగాం, జిల్లా అధ్యక్షుల హామీ..
ఖమ్మం, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): దేశ సరిహద్దుల్లో ఇద్దరు కుమారులు సైనికులుగా సేవలందిస్తున్న ఓ రైతు కుటుంబం ఇంటి నంబర్‌కు సంబంధించిన సమస్యపై, న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి మూడు జిల్లాల సమాచార హక్కు పరిరక్షణ కమిటీ(Right to Information Protection Committee)లు అండగా నిలిచాయి. అధికారిక రికార్డుల ఆధారంగా వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి, సమస్య పరిష్కారానికి చట్టబద్ధమైన మార్గాల్లో సహకరిస్తామని, ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీధర్ కాసోజు, వరంగల్ జిల్లా అధ్యక్షులు కాట కుమారస్వామి, జనగాం జిల్లా అధ్యక్షులు మహమ్మద్ జావిద్ తెలిపారు.
సైనికుడి ఫోన్ విజ్ఞప్తికి స్పందన.
దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న రైతు కుటుంబం వారి చిన్న కుమారుడు ఫోన్ ద్వారా ఖమ్మం జిల్లా సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ అధ్యక్షులు శ్రీధర్ కాసోజును సంప్రదించి, తమ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యను వివరించినట్లు తెలిపారు. మేము దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నాం. బార్డర్లో ఉండటం వల్ల కుటుంబ సమస్యపై అధికారులను స్వయంగా కలవడం కష్టంగా ఉంది. మా కుటుంబానికి ఇబ్బందులు, నష్టం జరుగుతున్నాయి. మీ సంస్థ ద్వారా న్యాయం జరిగేలా చూడండి. అవసరమైన
న్యాయపరమైన మార్గదర్శకత్వం అందించి అండగా నిలవండి అని, సైనికుడు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన జనగాం జిల్లా ఆర్టీఐ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ జావిద్ మరియు వరంగల్ జిల్లా ఆర్టీఐ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాట కుమారస్వామి, సమస్యను పూర్తిగా పరిశీలించి, అధికారిక రికార్డుల ఆధారంగా వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు అవసరమైన చట్టబద్ధమైన చర్యలకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
4-15 నుంచి 4-15/1, 4-15/2గా ఎందుకు మారింది?
ఇంటి నంబర్‌కు సంబంధించిన అంశంలో పాత రికార్డులు, ప్రస్తుత రికార్డులను పరిశీలించాల్సిన అవసరం ఉందని కమిటీ ప్రతినిధులు తెలిపారు. మొదట 4-15 ఇంటి నంబర్ ఎవరికి కేటాయించారు? ఏ సంవత్సరంలో కేటాయించారు? 1990 నుంచి ఇప్పటి వరకు ఇంటి పన్ను ఎవరి పేరుతో నమోదైంది? ఎవరు పన్ను చెల్లించారు? పాత రికార్డుల్లో మార్పులు జరిగాయా? ప్రస్తుతం 4-15/1 లేదా 4-15/2గా ఇంటి నంబర్ మార్చడానికి కారణం ఏమిటి? అనే అంశాలపై అధికారిక సమాచారం సేకరించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇంటి నంబర్ మార్పు కోసం ఎవరు దరఖాస్తు చేశారు, దరఖాస్తు తేదీ, దానిని పరిశీలించిన అధికారి, మార్పునకు ఆధారమైన ఉత్తర్వులు, అనుమతులు, పాత–కొత్త రికార్డుల్లో యజమాని పేర్ల నమోదు తదితర వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా కోరనున్నట్లు పేర్కొన్నారు.
జనగాం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆర్టీఐ.
ఈ వ్యవహారంపై సమాచార హక్కు చట్టం–2005 కింద జనగాం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆర్టీఐ దరఖాస్తు సమర్పించి, ఇంటి నంబర్‌కు సంబంధించిన పాత, ప్రస్తుత రికార్డులు, ఇంటి నంబర్ మార్పుకు సంబంధించిన దరఖాస్తులు, అనుమతులు, ఉత్తర్వులు, పన్ను రికార్డులు తదితర అధికారిక వివరాలను కోరనున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.
రైతు కుటుంబం ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు.
వరంగల్ జిల్లా అధ్యక్షులు కాట కుమారస్వామి, జనగాం జిల్లా అధ్యక్షులు మహమ్మద్ జావిద్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీధర్ కాసోజు మాట్లాడుతూ, దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల కుటుంబానికి అవసరమైన సహకారం అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.
వాస్తవాలు అధికారిక రికార్డుల ద్వారా వెలుగులోకి రావాలి. రైతు కుటుంబానికి అన్యాయం జరిగిందా లేదా అనే విషయం రికార్డుల ఆధారంగా స్పష్టత రావాలి. సమస్య పరిష్కారం అయ్యే వరకు సమాచార హక్కు చట్టం, ఇతర చట్టబద్ధమైన మార్గాల్లో అవసరమైన సహకారం అందిస్తాం. రైతు కుటుంబం ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు అని వారు స్పష్టం చేశారు.